నియంతల (ఆర్మీ చీఫ్‌ల) పాలనలో భారత్‌పై పాక్ ప్రాబల్యం అధికంగా ఉండేదని, పౌర ప్రభుత్వాల పాలనలో అంతా నాశనమైందని పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు, నియంత పర్వేజ్ ముషారఫ్ పేర్కొన్నారు. ఆర్మీ చీఫ్‌లు అయూబ్‌ఖాన్, జనరల్ జియా ఉల్హక్ల పాలనలోనే పాక్ సరైన మార్గంలో నడిచిందని స్పష్టం చేశారు.
బీబీసీ ఉర్దూ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌కు వ్యతిరేకంగా ముషారఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికైన నవాజ్ షరీఫ్ భారత్‌తో సంబంధాలు అంటూ పలు అంశాల్లో పైచేయి సాధించలేక పోయారని ఆరోపించారు. నియంతల పాలనలో ఆసియా దేశాలు ఎంతో ప్రగతి సాధించాయని అభిప్రాయపడ్డారు.
ఆర్మీ చీఫ్‌ల పాలనలోనే తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారని, వారి అభీష్టం మేరకు తాను 1999లో తిరుగుబాటు చేశానని ముషారఫ్ తెలిపారు. ప్రజల చేత ఎన్నికైన నేతలు దేశాన్ని నాశనం చేయగా, ఆర్మీ చీఫ్‌లు మాత్రం ప్రజల హక్కులను రక్షించారని కొనియాడారు.
2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా కొనసాగిన ముషారఫ్ ప్రస్తుతం దుబాయ్‌లో తలదాచుకుంటున్నారు. రాజ్యాంగాన్ని రద్దుచేసి 2007లో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం దేశద్రోహం, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసు సహా అనేక ఆరోపణలను ముషారఫ్ ఎదుర్కొంటున్నారు.