//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోలుకొంటున్న ముంబై... కుండపోత వర్షాలకు 15 మంది మృతి

Category : national

మూడురోజులుగా ముంబైని అతలాకుతలం చేసిన వర్షాలు  తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉద‌యం కూడా వ‌ర్షం లేక‌పోవ‌డంతో ముంబై వాసులు త‌మ ప‌నుల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. మంగళవారం రాత్రి ఇండ్లు కూలి చనిపోయిన ముగ్గురితో కలిపి వర్షాలధాటికి మొత్తం 16 మంది మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. మరో 12 మందివరకు గాయపడినట్టు చెప్పారు. 

అయితే పలు ప్రాంతాలకు ఇంకా అధిక వర్షం ముప్పు పొంచిఉన్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ముంబైలోని 65లక్షల మంది ఆధారపడ్డ సబర్బన్ రైలు సేవలను పాక్షికంగా పునరుద్ధరించారు. పశ్చిమ, మధ్య, నౌకాశ్రయ మార్గాల్లో పలు రైళ్లు నడువడంతో రాత్రంతా స్టేషన్లలోనే ఉండిపోయిన వందల మంది ఇండ్లకు చేరుకోగలిగారు. 

సబర్బన్ రైళ్ల రాకపోకల్లో అంతరాయంతో ముంబై డబ్బావాలాలు వివిధ రైళ్ల ప్రయాణికులకు అందించే దాదాపు రెండు లక్షల టిఫిన్ల డెలివరీని బుధవారం రద్దు చేసుకున్నారు. రైళ్ల నుంచి జారిపడి, ఇతర రైలు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందినట్టు రైల్వే పోలీసులు ప్రకటించారు. ఠాణేలో మరో 14 ఏండ్ల బాలుడు కాలువలో పడి అదృశమైనట్టు అధికారులు తెలిపారు. 

వర్షాల్లో చిక్కుకున్న నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు నౌకాదళం ముందుకొచ్చింది. సామాజిక వంటశాలలతోపాటు ఆహార కౌంటర్ల ద్వారా తినుబండారాలు పంపిణీ చేసినట్టు నేవీ అధికార ప్రతినిధి తెలిపారు.చర్చ్‌గేట్, బైకలా, పరేల్, సీఎస్టీ, వర్లీ, టార్దీ, సెంట్రల్ ముంబై, దాదర్, మంఖుర్డ్, చెంబూర్, మలాడ్, ఘట్కోపర్ ప్రాంతా ల్లో ఫుడ్ కౌంటర్లను ఏర్పాటుచేసినట్టు చెప్పారు.

 ముంబైలో మంగళవారం 331.4 మిమీ వర్షం పడినట్టు శాంటాక్రుజ్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. 2005 జూలై 26న అత్యధికంగా 944 మిమీ వర్షం పడిందని, ఆ తర్వాత రెండో అధిక వర్షపాతం మంగళవారమే నమోదైందని తెలిపింది. 1997 ఆగస్టు 23న 346.2 మిమీ వర్షంతో ఒకేరోజు ఎక్కువ వర్షం కురిసినట్టు రికార్డు నమోదైంది.

Related News