ఐపిఎల్ పదో సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలి, ముంబై ఇండియన్స్ బౌలర్ల పరాక్రమం ముందు బొక్కబోర్లా పడింది. కేవలం 18.5 ఓవర్లలోనే 107కే కుప్పకూలింది. దీంతో శుక్రవారం రాత్రి క్వాలిఫయర్-2లో ముంబై 6 వికెట్ల తేడాతో కోల్‌కతాపై నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగే ఫైనల్స్ లో పూణే తో పోరుకు ముంబై సిద్దపడుతున్నది.
టాస్ ఓడిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. సూర్యకుమార్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఒక్కరు కూడా రాణించలేకపోయారు. తర్వాత ముంబై 14.3 ఓవర్లలో 4 వికెట్లకు 111 పరుగులు చేసింది. క్రునాల్ పాండ్యా (30 బంతుల్లో 45 నాటౌట్; 8 ఫోర్లు), రోహిత్ (24 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు.
స్వల్ప లక్ష్యం కావడంతో ఆరంభం నుంచే కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 36 పరుగులకే ఓపెనర్లతో పాటు రాయుడు (6) వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ రోహిత్, క్రునాల్ ఓపికగా బ్యాటింగ్ చేశారు. పిచ్ నుంచి సహకారం లేకపోవడంతో సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ చెత్త బంతులను మాత్రమే భారీ షాట్లుగా మలిచే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించాకా రోహిత్ వెనుదిరిగాడు. తర్వాత విజయానికి అవసరమైన 20 పరుగులను పొలార్డ్ (9 నాటౌట్), క్రునాల్ సమకూర్చారు. కర్ణ్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.