//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫోర్బ్స్ మేటి గ్లోబల్ గేమ్ ఛేంజర్ ముకేశ్ అంబానీ

Category : national

అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి తొలిస్థానం వరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకురావడం, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడంలో తన సత్తా చాటినందుకు గాను ముకేశ్‌కు ఈ స్థానం లభించింది. 

25 మంది ధైర్యవంతులైన నాయకులతో కూడిన ఈ జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించడం ఇది రెండోసారి. భారత్‌లో అత్యధిక మందిని ఇంటర్నెట్ పరిధిలోకి తీసుకురావడానికి ముకేశ్ చేసిన కృషిని ఫోర్బ్స్ కొనియాడింది. చమురు నుంచి గ్యాస్ వరకు వ్యాపారాల్లో తనదైన ముద్రవేసిన ముకేశ్ గతేడాది సెప్టెంబర్‌లో టెలికం రంగంలోకి అడుగుపెట్టారు. 

అందరికి ఇంటర్నెట్ సేవలను చౌకగా అందించాలనే ఉద్దేశంతో జియో పేరుతో టెలికం సేవలను ఆరంభించారు. ఆరు నెలల్లోనే 10 కోట్ల మంది వినియోగదారులను ఆకట్టుకున్నారు. 

గృహోపకరణాల తయారీలో అగ్రగామి సంస్థ డైసన్ వ్యవస్థాపకుడు జేమ్స్ డైసన్, అమెరికన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ బ్లాక్‌రాక్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పింక్, సౌదీ అరేబియా డిప్యూటీ క్రౌన్ మహమ్మద్ బిన్ సల్మాన్, స్నాప్ సహ వ్యవస్థాపకుడు ఇవాన్ స్పీగల్, చైనీస్ రైడ్ షేరింగ్ దిగ్గజం దిది చుక్సింగ్ వ్యవస్థాపకుడు చెంగ్, ఆఫ్రికన్ రిటైల్ టైకాన్ క్రిస్టో వౌస్‌లకు ఈ జాబితాలో చోటు దక్కింది. 

బుధవారం నాటికి ముకేశ్ అంబానీ ఆస్తి విలువ 710 కోట్ల డాలర్లు పెరిగి 2,990 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇంచుమించు ఆయన ఆస్తి విలువ రూ.2 లక్షల కోట్లకు చేరువైంది. డిసెంబర్ 31న నమోదైన దాంతో పోలిస్తే భారీగా పుంజుకున్నదని బ్లూమ్‌బర్గ్ వెబ్‌సైట్ కథనంలో పేర్కొంది. 

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో ఉదయ్ కొటక్, కుమార మంగళం బిర్లా, గౌతమ్ అదానీ, విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ, సన్‌ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీలు ఉన్నారు.

Related News