మేనల్లుడి వివాహ వేడుకకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి హోటల్ గదిలో గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆమె భౌతిక కాయాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ముందుకు వచ్చారు. రిలయన్స్ సంస్థకు చెందిన 13 సీట్ల ప్రైవేటు జెట్ విమానాన్ని దుబాయ్ కి పంపించారు.
నిన్న మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ విమానం ముంబై నుంచి దుబాయ్ కు వెళ్లింది. శవపరీక్షలో ఆలస్యం కారణంగా శ్రీదేవి మృతదేహం స్వదేశం చేరలేదు. శ్రీదేవి పార్థివ దేహంతో పాటు కుటుంబ సభ్యులు, సమీప బంధువులు ఈ విమానంలో ముంబై చేరనున్నారు. నేడు ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శ్రీదేవిని చివరిసారిగా చూడడానికి ముంబైలోని ఆమె నివాసం వద్ద వేలాదిగా ఆమె అభిమానులు గుమిగూడి ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని చిత్ర పరిశ్రమల్లో శ్రీదేవి వందలాది చిత్రాలలో నటించి కోట్లాది మంది అభిమానులని సంపాదించారు. వాస్తవానికి ఆదివారం సాయంత్రమే శ్రీదేవి భౌతిక కాయం ముంబై కి చేరుకోవాలి. శవ పరీక్షలలో జాప్యం జరగడంతో ఆమె మృతదేహాన్ని నేడు సోమవారం ముంబైకి తీసుకురానున్నారు.