మహేంద్ర సింగ్ ధోనీపై భారత మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టు విజయంలో ధోనీ-కోహ్లీ కీలక పాత్ర పోషిస్తున్నారని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆసీస్‌పై కోహ్లీ సేన 4-1తో వన్డే సిరీస్‌ను దక్కించుకోవడంపై నయాన్ మాట్లాడుతూ..‘ధోనీ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న కోహ్లీ అతి తక్కువ సమయంలోనే అద్భుత విజయాలు అందుకున్నాడు. ధోనీ నుంచి విలువైన సలహాలు, సూచనలు అందుకుంటూ కోహ్లీ మరింతగా రాటుదేలుతున్నాడు. పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్నప్పటి నుంచి కోహ్లీ-ధోనీ మధ్య కెమిస్ట్రీ మరింత పెరిగింది’ అని నయాన్ అన్నాడు.
‘అనుభవజ్ఞుడైన ధోనీ సేవలు జట్టుకు ఎంతో అవసరం. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ధోనీ.. బౌలర్లకు, ఫీల్డర్లకు సలహాలు ఇస్తూ మనకు కనిపిస్తూనే ఉన్నాడు. అతను 2019 ప్రపంచకప్ జట్టులో తప్పక ఉంటాడు. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ధోనీ విషయంలో వయసు ఒక సంఖ్య మాత్రమే. ఆటకు ఏమాత్రం సంబంధం లేదు. అతను గొప్ప ఫినిషరే కాదు మ్యాచ్ విన్నర్ కూడా. అతను జట్టులో ఉంటే కోహ్లీ ఎంతో లాభపడతాడు. ఫిట్నెస్, ఫామ్‌ను కొనసాగిస్తే ధోనీకి.. కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి మద్దతు తప్పక ఉంటుంది’ అని నయాన్ తెలిపాడు