భారత్, అమెరికా దేశాధినేతలు ఉగ్రవాదానికి ఆలంబనగా నిలుస్తున్న పాకిస్తాన్ కు కఠిన హెచ్చరిక చేశారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా అమెరికా పర్యటనకు వచ్చిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సందర్భంగా తమ రెండు దేశాల ముందున్న ప్రధమ ప్రాధాన్యం ఉగ్రవాదాన్ని నిర్మూలించడమేనని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ తన భూభాగాల్లో జరుగుతున్న ఉగ్రవాద చర్యలను అడ్డుకోవాలని, ఇతర దేశాల మీదకు ఉగ్రదాడులను అరికట్టాలని వారిద్దరూ హెచ్చరిక రూపంలో స్పష్టం చేశారు. అంతేగాక, ముంబయి, పఠాన్‌కోట్ దాడుల్లో నేరస్థులకు శిక్షపడేందుకు పాక్ భారత్‌తో సహకరించాలని చెప్పారు. భారత్ తమకు నిజమైన స్నేహితుడని అంటూ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిర్ములించడం కోసం ఇరువురం కలసి పనిచేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరువురం కలసి పనిచేయాలని, ఉగ్రవాద స్థావరాలను నిర్ములించాలని ఇద్దరు అధినేతలు నిర్ణయించారు.
మూడేళ్ల వ్యవధిలో ఐదోసారి అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోడీకి ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అపూర్వస్వాగతం పలికారు. శ్వేతసౌధం చేరుకున్న ప్రధాని మోడీని ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి ఎదురెళ్లి మరీ ఆప్యాయంగా ఆహ్వానించారు. అనంతరం వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
"ప్రపంచంలో భారత్-అమెరికా ప్రధాన ఆర్థిక శక్తులు. దేశం, సమాజ ఆర్థిక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా అధ్యక్షుడు ట్రంప్, నేను కృషి చేస్తున్నాం. ఈ కృషి భవిష్యత్‌లోనూ కొనసాగుతుంది. ఇరు దేశాలకు సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం మా ప్రాధాన్యాల్లో ఒకటి." అని ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ తెలిపారు.
అమెరికా, భారత్ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, స్వశక్తితో ఎదగడం ఇరుదేశాల లక్ష్యం అని అంటూ అమెరికా-భారత్ భాగస్వామ్యం బలమైంది, వ్యూహాత్మకమైందని చెప్పారు. "నవ భారత నిర్మాణంపై నా కల, మేక్ అమెరికా, గ్రేట్ అమెరికాపై అధ్యక్షుడు ట్రంప్ ఆశయాల్లో సారూప్యత ఉంది. దీని వల్ల నూతన అడుగు పడుతుందని విశ్వసిస్తున్నాను" అని భారత ప్రధాని పేర్కొన్నారు.
వాణిజ్య, వ్యాపార రంగాల అభివృద్ధి పట్ల తాము ప్రాధాన్యత కల్పిస్తున్నామని, సాంకేతికత, ఆవిష్కరణ, విజ్ఞాన ఆర్థిక రంగాల్లో సహకారం పెంపొందించడం ఇరువురి లక్ష్యం అని స్పష్టం చేశారు. అమెరికా-భారత్ సహకారం పెంపులో భాగంగా డిజిటల్ భాగస్వామ్యం బలోపేతం చేయడం కోసం తాము ముందడుగు వేస్తామని తెలిపారు.
"భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. త్వరలో మేమూ ఈ స్థాయిని అందుకుంటామని ఆశిస్తున్నాం" అని ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్ చెప్పారు. భారత్ తమ దేశ చరిత్రలోనే అతిపెద్ద పన్ను విధానం జీఎస్టీని ప్రవేశపెట్టనున్నట్లు తెలుపుతూ త్వరలోనే తామూ ఇదే పన్ను విధానాన్ని తీసుకొస్తున్నామని ప్రకటించారు. భారత పౌరుల కోసం కొత్త అవకాశాలు సృష్టిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఉండే అవినీతిపై భారత్ యుద్ధం కొనసాగించడం పట్ల అభినందలు తెలుపుతూ ఉద్యోగ కల్పన కోసం కలిసి కట్టుగా పనిచేద్దామని ప్రతిపాదించారు. ఇరుదేశాల మధ్య ఎగుమతులకున్న పరిమితులను తొలగించాలని, అమెరికా వస్తువులను భారత మార్కెట్లో విక్రయించాలని ఈ సందర్భంగా ట్రంప్ కోరారు.