తొలిసారి భారత్ ఫిఫా టోర్నీకి ఆతిథ్యమిస్తోంది! టోర్నీని అట్టహాసంగా ఆరంభించాలని భారత ప్రభుత్వం ఆశించినప్పటికీ ఫిఫా నుంచి అందుకు అనుమతి లభించలేదు. దీంతో పెద్దగా హడావుడి లేకుండానే శుక్రవారం టోర్నీ ఆరంభం కానుంది. ఐతే తొలి మ్యాచ్కు ముందు స్టేడియంలో చిన్న ఆరంభ వేడుకను ఏర్పాటు చేసింది భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్). దిల్లీలోని జవహర్లాల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ చెప్పాడు.
‘‘మిమ్మల్ని చూసి అసూయ చెందుతున్నందుకు మన్నించండి. మాకెవ్వరికీ రాని అవకాశం మీకు లభించింది. అదే సమయంలో ఇది గర్వకారణంగా అనిపించే విషయం. ఫుట్బాల్ ప్రపంచకప్ ఆడుతున్న మీకు ఈ నెల రోజుల పాటు మేం అభిమానులుగా ఉంటాం. కమాన్ ఇండియా’’ -సునీల్ ఛెత్రి, భారత సీనియర్ ఫుట్బాల్ జట్టు కెప్టెన్
‘‘ప్రపంచకప్లో దేశానికి ప్రాతినధ్యం వహించాలన్న మా కల నెరవేరబోతోంది. దేశం గర్వించేలా పోరాడతాం. ఈ టోర్నీ కోసం కొన్ని నెలలుగా ఎన్నో త్యాగాలు చేశాం. కుటుంబానికి దూరంగా ఉండి సిద్ధమవుతున్నాం. అమెరికాతో మ్యాచ్లో ఎలాంటి అవకాశాన్ని వదులుకోం’’ - అమర్జీత్ సింగ్, భారత జట్టు కెప్టెన్.