ఖజఖస్తాన్లోని ఆస్తానాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సంబంధాలు ఉద్రిక్తంగా మారుతున్న పొరుగు దేశాధినేతలను పలకరిస్తూ సరికొత్త దౌత్యానికి దిగారు. చాలాకాలం తరువాత పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను మోడీ పలుకరించి కుశల ప్రశ్నలు వేశారు. ఆ తరువాత చైనా అధ్యక్షుడు క్సీ జింపింగ్ భేటీ అయి రెండు దేశాల ఆందోళనలను పరస్పరం గౌరవించు కుందామని సూచించారు.
సభ్య దేశాల నేతల గౌరవార్థం జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా నవాజ్ షరీఫ్ ను కలుసుకొని ఇటీవలనే హుద్రోగ శాస్త్ర చికిత్స చేసుకున్న ఆయన ఆరోగ్యం గురించి మోడీ అడిగి తెలుసుకున్నారు. అలాగే షరీఫ్ తల్లి, ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా మోదీ అడిగినట్లు తెలుస్తోంది.అయితే మోదీ, షరీఫ్‌ల మధ్య భేటీ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని, పాకిస్తాన్‌నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు.
శుక్రవారం చైనా అధ్యక్షుడు క్సీ జింపింగ్ తో భేటీ అయి రెండు దేశాలు అంతర్జాతీయ వ్యవహారాలలో తమ సహకారం సామర్ధ్యాన్ని పటిష్ట పరచు కోవాలని, సమాచార, సమంవ్యం లను పెంపొందించు కోవాలని అభిలాషను వ్యక్తం చేశారు. గత నెల చైనాలో జరిగిన 29మంది ప్రపంచ దేశాలు పాల్గొన్న బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ సదస్సును భారత్ బహిష్కరించిన తరువాత ఇరు దేశాల అధినేతలు కలుసు కోవడం ఇదే కావడం గమనార్హం.