//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమెరికా నుండి వట్టి చేతులతో తిరిగి వచ్చిన మోడీ !

Category : world

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను మొదటిసారిగా కలుసుకొని, ద్వైపాక్షిక చర్చలు జరిపి, "నిజమైన మిత్రుడు" అంటూ ట్రంప్ నుండి సర్టిఫికెట్ పొంది స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే అయన పర్యటన సందర్భంగా ట్రంప్ తమ దేశానికి వ్యాపార పరంగా మంచి ప్రయోజనం కలిగించారు గాని, భారత్ దేశానికి మాత్రం నిర్దుష్టంగా ఎటువంటి ప్రయోజనం కలిగించలేక పోయారని పరిశీలకులు చెబుతున్నారు. 

ముఖ్యంగా భారత్ ఐటి కంపెనీలకు ఆందోళన కలిగిస్తున్న హెచ్1బీ వీసాల అంశాన్ని అసలు ప్రస్తావించక పోవడంతో ఈ విషయమై ట్రంప్ నుండి నిర్దుష్ట హామీలతో తిరిగి వస్తారని ఎదురు చుసిన వారికి తీవ్ర ఆశాభంగం కలిగింది. సంయుక్త ప్రకటనలో "భారత్ నుండి పరికరాలకు ఆర్డర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది మాకు చాల సంతోషం కలిగిస్తుంది. అమెరికా వాలే సైనిక పరికరాలను అందించేవారు మరొకరు లేరు" అంటూ ట్రంప్  పేర్కొనడం గమనార్హం. 

అమెరికా నుండి సముద్ర గస్తీకి ఉపయోగించే 22 డ్రోన్ లను కొనుగోలు చేయాలనీ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రస్తావించారు. దానితో పాటు జెట్ ఎయిర్ వేస్ అమెరికా నుండి 200 బోయింగ్ విమానాలు కొనుగోలు చేయాలనీ నిర్ణయించింది. ఈ కొనుగోళ్ల కారణంగా అమెరికాలో సుమారు రెండు లక్షల మందికి ఉపాధి కలుగనున్నది. అంటే మోడీ పర్యటన కారణంగా భారత్ నుండి మంచి వ్యాపారాన్ని ట్రంప్ రాబట్ట గలిగారు అన్నమాట. 

వ్యక్తిగతంగా ట్రంప్ వ్యాపారవేత్త కావడంతో ఎదుటివారి నుండి ఏవిధంగా ప్రయోజనం పొందాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన సౌదీఅరేబియా కు పర్యటించిన సందర్భంగా 100 బిలియన్ డాలర్ల సైనిక పరికరాలతో పాటు 300 బిలియన్ డాలర్ల వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మధ్యనే ఖతార్ నుండి 100 బిలియన్ డాలర్ల సైనిక పరికరాల ఆర్డర్ పొందారు. 

అయితే ప్రతి సందర్భంలో ఎన్నిక ప్రచార రీతిలో ప్రచారంపై మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చే నరేంద్ర మోడీ ఈ పర్యటన ద్వారా భారత దేశానికి ఏమి సాధించారు ? అంటే విచారమే కలుగుతుంది. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఉగ్రవాది సలాహుద్దీన్ ను `అంతర్జాతీయ ఉగ్రవాది' గా అమెరికా ప్రకటించడంతో భారత్ కు కొంత నైతిక మద్దతు వ్యక్తం చేసిన్నట్లు అయింది. అయితే ఇద్దరు అధినేతల సంయుక్త ప్రకటనలో పాకిస్థాన్ ప్రస్తావన ఎక్కడ లేదు.

జమ్మూ కాశ్మీర్ లోకి పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇది ఒక విధంగా భారత్ కు తీవ్ర ఆశాభంగం కలిగించిన అంశమే. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి తనకు ఏమాత్రం సంబంధం లేని అంశంగా ట్రంప్ వ్యవహరించారు. "పాకిస్తాన్ మీ తలనొప్పి. ఈ విషయమై మేము పాకిస్థాన్ పై వత్తిడి తీసుకురాము"  అని నిర్మోహాటంగా మోడీతో ట్రంప్ చెప్పిన్నట్లు అయింది. 

అయితే సంయుక్త ప్రటకనలో "ఇస్లామిక్ స్టేట్ (ఐ యస్)  ఉగ్రవాదాన్ని విధ్వంసం చేస్తాం" అని పేర్కొనడం గమనార్హం. భారత్ కు సంబంధించి ఐ యస్ వ్యవహారంలో జోక్యం చేసుకో వలసిన అవసరం లేదు. కేవలం అమెరికాను మెప్పించడం కోసమే ఈ అంశం చేర్చడానికి మోడీ ఒప్పుకున్నట్లు అయింది. 

ఇద్దరు నేతలు ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించారని మీడియాలో కధనాలు ఎన్ని వచ్చినా ఆచరణలో భారత్ కు ఒరిగినది ఏమీ లేదని స్పష్టం అవుతుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా పలుకుబడిని కట్టడి చేయడం కోసం అమెరికాతో భాగస్వామ్యం పొందటం మోడీ పర్యటన వల్లన వీలయినదని చెప్పవచ్చు. అయితే అమెరికా సైన్యంతో కౌగలించు కోవడం భారత్ కు ఏమాత్రం ప్రయోజనమో చరిత్రనే చెప్పాలి. ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేము.