//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ ప్రభుత్వం టివిలో హీరో..చేతల్లో జీరో

Category : national politics

మూడేళ్లలో మోడీ ప్రభుత్వం సాధించింది శూన్యమని కాంగ్రెస్‌ విమర్శించింది. టివి ప్రకటనల్లో హీరోగా నిలిచిన మోడీ ప్రభుత్వం చేతల్లో జీరోగా నిలిచిందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సిడబ్ల్యుసి) సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్‌ పేర్కొంది. "గత మూడేళ్లలో మోడీ ప్రభుత్వం సాధించిన ఏకైక విజయం ప్రజల్లో భయాన్ని పెంచడమే'' అని విమర్శించారు.

 కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, పి.చిదంబరం, అంబికా సోనీ, జనార్దన్‌ ద్వివేదిలు హాజరయ్యారు. అక్టోబర్ 15 నాటికి సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలనీ నిర్ణయించడం ద్వారా రాహుల్ గాంధీ పట్టాభిషేకం అప్పుడే అన్న సంకేతం ఇచ్చారు. మోడీ పాలనలో దేశం సంకుచిత భావాలవైపు అడుగులు వేస్తోందని ఈ సందర్భాగమా సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.   జమ్మూకాశ్మీర్‌ సమస్యను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 

‘మోదీ ఓ నియంత. తన నియంతృత్వ విధానాలతో.. వ్యవస్థలు, రాజకీయ పార్టీలు, పౌరసమాజం, మీడియా గొంతు నొక్కాలని చూస్తున్నారు.’ అని సోనియా ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. రాజకీయ ప్రత్యర్థులను... ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి గొంతు నొక్కేందుకు కేంద్రం అధికారయంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.

ప్రభుత్వ అవినీతి బయటపడకుండా అన్ని వ్యవస్థలను తొక్కిపెడుతున్నారని ధ్వజమెత్తారు. దేశ ప్రజల నడుమ విభజన తీసుకొచ్చే ఆలోచనలను మోదీ సర్కార్‌ పెంచి పోషిస్తోందని, ప్రజల జీవన విధానాలు.. ఆహారపు అలవాట్లపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి ధోరణి పట్ల అప్రమత్తంగా ఉండాలని, భారతదేశ విలువలు కాపాడేందుకు సిద్ధంగా ఉండాలని సోనియా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

భారత ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలే ఊపిరి ఊదుతున్నాయని, లేదంటే ఈ పాటికే చతికిలబడిపోయేవాళ్లమని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు. ప్రయివేటు రంగంలో పెట్టుబడులు గణనీయంగా పడిపోయాయని, ఉద్యోగ కల్పనలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఇప్పటివరకూ కొత్త పరిశ్రమలేవీ రాలేదని చెప్పారు. పెద్ద నోట్లరద్దు ఆర్థిక వృద్ధి రేటు మందగించడానికి కారణమైందని చెప్పారు.