//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ట్రంప్ తో బంధానికి ఆచితూచి అడుగులేస్తున్న మోడీ

Category : national

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైనప్పటి నుంచి అనిశ్చితంగా మారిన  భారత్‌-అమెరికా సంబంధాలను  మళ్ళీ గాడిలో పెట్టడమే కోసం తన రెండు రోజుల అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ రాత్రికి ట్రంప్ తో జరుననున్న భేటీలో ఈ విషయమై వ్యూహాత్మకంగా పావులు కదుపనున్నారు. మోడీ, ట్రంప్‌లు ఇంతకుముందు మూడుసార్లు సంభాషించుకున్నా ద్వైపాక్షిక అంశాలపై ముఖాముఖి సమావేశం కావడం ఇదే మొదటిసారి.

 బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ డబ్ల్యూ బుష్‌, బరాక్‌ ఒబామాలు చైనా విజృంభణకు అడ్డుకట్ట వేయడానికి భారతదేశాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణించి ఆర్థిక బంధాన్ని బలపరచుకున్నారు. కానీ, డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక ఈ బంధం సందిగ్ధంలో పడిపోయింది. భారత్‌ ఐటీ సిబ్బంది అమెరికన్ల ఉద్యోగాలను కాజేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో ఆడిపోసుకున్న ట్రంప్‌, పారిస్‌ వాతావరణ ఒప్పందాన్ని రద్దుచేసే సందర్భంలోనూ భారత్‌పై నిందలు మోపారు.

గత అధ్యక్షుడు బరాక్ ఒబామా చేపట్టిన ప్రతి అంశాన్ని తిరస్కరిస్తున్న ట్రంప్ ఆయనతో సన్నిహితంగా వ్యవహరించి, హిల్లరీ క్లింటన్ గెలుపు ఖాయం అనుకోని ఎన్నికల సమయంలో మర్యాదపూర్వకంగా నైనా తనను పలకరించని మోడీ ప్రభుత్వం పట్ల అనుమానాస్పదంగా చూస్తున్నారు. అందుకనే  ఈ సారి తన పర్యటనలో మోడీ అమెరికాలో హడావుడి చేయడం లేదు. గతంలో రెండు సార్లు అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్, కాలిఫోర్నియా లలో ప్రవాస భారతీయులతో భారీ బహిరంగ సభలలో ప్రసంగించి హడావుడి చేశారు.

హూస్టన్ లో అటువంటి ఆర్భాటం చేయాలని ముందు అనుకున్నా `వలసవాదులు' పట్ల ప్రతికూలంగా ఉన్న ట్రంప్ ను రెచ్చగొట్టిన్నట్లు కాగడాలని ఈ పర్యాయం మోడీ విరమించుకున్నారు.  సాధారణంగా మోడీ అమెరికా పర్యటనల్లో ముందు వెళ్లి అటువంటి ఏర్పాటు చూసే శౌర్య దోయల్ , రామ్ మాధవ్ ఈ పర్యాయం లేకపోవడం గమనార్హం. 

ట్రంప్ ట్విట్టర్ ద్వారా  అమెరికా పర్యటనకు వచ్చిన మోడీ కి  ఘన స్వాగతం పలికారు. మోడీ రాకకోసం శ్వేతసౌధం ఎంతగానో ఎదురుచూస్తున్నదని తెలిపారు. నిజమైన మిత్రుడితో వ్యూహాత్మక విషయాలపై చర్చలు జరుపుతానని ట్రంప్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు మోడీ కూడా స్పందిస్తూ ఎంతో ఆప్యాయంగా వ్యక్తిగతంగా స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు. మీతో సమావేశమై చర్చలు జరిపేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ మోడీ ట్వీట్ చేశారు.