టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ మొబైల్ కంపెనీలకు వర్తించే ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీలను (ఐయూసీ) మరింత తగ్గించనున్నదని సమాచారం. దానితో మొబైల్ కాల్ చార్జీలు మరింత తగ్గే అవకాశం ఉంది. కాల్ అనుసంధానం కోసం ఒక మొబైల్ ఆపరేటర్ మరో ఆపరేటర్‌కు చెల్లించే రుసుమే ఐయూసీ. ప్రస్తుతం ఈ చార్జీ నిమిషం కాల్‌కు 14 పైసలుగా ఉంది. త్వరలో ట్రాయ్.. ఐయూసీని 10 పైసల దిగువకు తగ్గించవచ్చని తెలుస్తున్నది.
ఏడాది క్రితం టెలికం రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశించడంతో మొబైల్ కాలింగ్, డాటా సేవలు అత్యంత చౌకగా మారాయి. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో డాటాకు చార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ అపరిమిత ఉచిత కాలింగ్ సేవలందిస్తున్నది. ఇంటర్ కనెక్ట్ చార్జీలను ఎత్తివేయాలని జియో కోరుతుంటే ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా వంటి మొదటి తరం ప్రైవేట్ సంస్థలు మాత్రం ఐయూసీ రేటును ప్రస్తుతమున్న 14 పైసల నుంచి 30 పైసలకు పెంచాలని కోరుతున్నాయి.
ఐయూసీ రేట్లను సమీక్షించేందుకు గత ఏడాది ఆగస్టు 5న ట్రాయ్ చర్చాపత్రాన్ని విడుదల చేసింది. సంబంధిత వర్గాలందరి నుంచి సేకరించిన అభిప్రాయాలు, సూచనల ఆధారంగా నెల రోజుల్లో నియంత్రణ మండలి కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఇందులోభాగంగా ఇంటర్నెట్ ద్వారా చేసే కాల్స్‌కు ఐయూసీ రేటును నిమిషానికి 3 పైసలకు తగ్గించవచ్చని తెలుస్తున్నది.
నెట్‌వర్క్‌లన్నీ 4జీ లేదా వోల్టే టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అవుతున్న నేపథ్యంలో ఐయూసీ కింద నిమిషానికి 14 పైసలు వసూలు చేయడం చాలా ఎక్కువని కొందరు అభిప్రాయపడుతున్నారు. త్వరలో మొబైల్ వినియోగదారులు అన్ని టెలికం కంపెనీల టారిఫ్ ప్లాన్లను ట్రాయ్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. టారిఫ్ పథకాలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోనూ సమర్పించాలని నియంత్రణ మండలి సంస్థలను కోరింది. టారిఫ్ ప్లాన్లను అందరికీ అందుబాటులోకి తేవడం ద్వారా పాదర్శకత పెరుగుతుందని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ అభిప్రాయపడ్డారు.