కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ప్రపంచ కప్ ను పోగొట్టుకున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ క్రీడా ప్రతిభకు మాత్రం అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దానితో ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. 2017 ఐసీసీ మహిళా వరల్డ్ కప్ జట్టు కెప్టెన్‌గా ఆమెను ఐసీసీ ఎంపిక చేసింది.
తాజాగా ముగిసిన వరల్డ్ కప్‌లో భారత జట్టును తన నాయకత్వంలో ఫైనల్‌కు చేర్చిన 34 ఏళ్ల మిథాలీకి ఈ గొప్ప గౌరవాన్ని కట్టబెట్టింది. కెప్టెన్సీకి మారుపేరుగా నిలిచిన మిథాలీ బ్యాటింగ్‌లోనూ అసాధారణంగా రాణించి 409 పరుగులు చేసింది. అత్యంత కీలకమైన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 109 పరుగులు చేసి జట్టుకు 186 పరుగుల భారీ విజయాన్ని అందించింది. ఈ విజయంతో భారత్ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.
మిథాలీతోపాటు అద్భుతంగా రాణించిన భారత మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తిశర్మ కూడా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించారు. తాజా వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ల గౌరవార్థం ప్రకటించిన ప్రపంచకప్ జట్టులో నలుగురు ఇంగ్లండ్ క్రికెటర్లు చోటు సంపాదించుకున్నారు.