ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్తూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా చూస్తున్నానని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఇప్పటి వరకు 39 రోజులలో 49 గ్రామాల్లో రోజుకు 10-12 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. అన్ని కులాల, వర్గాల ప్రజలను స్వయంగా కలసి జరిగిన, జరుగుచున్న అభివృద్ధి కార్యక్రమాల అమలును తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పూర్తి స్థాయి మేలు జరిగేలా విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. గ్రామాలలో ఇంకా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు కావలసిన వారినుండి తాను స్వయంగా దరఖాస్తులు తీసుకుని పరిష్కార మార్గాలను అమలు చేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పుడెక్కడా ఎన్నికలు లేవని తాము ఓట్ల కోసం రాలేదని సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయాలనే వచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో ప్రశ్నించాలి కానీ వైసీపీ నాయకులు అసెంబ్లీ ఎగ్గొట్టి పాదయాత్రలకు బయలుదేరారని విమర్శించారు. ఆయా గ్రామాలలో మూడున్నరేళ్ల పాటు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు.