ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు సీఎం పదవి ఆదర్శంతో తాము పనిచేసే సంస్థకు ఒక్క రోజు సీఈవోగా పనిచేసే అవకాశాన్ని ఉద్యోగులకు కల్పించారు ఫ్లిప్ కార్ట్ కంపెనీ సీఈవో కళ్యాన్ కృష్ణమూర్తి. దేశంలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఒక్కరోజు సీఈవోగా 34 ఏండ్ల లక్కీ గర్ల్ పద్మిని పగడాల మంగళవారం బాధ్యతలు నిర్వహించారు. వేర్‌హౌజింగ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న పద్మిని ఒక్కరోజు బాస్‌గా వ్యవహరించారు. పదో వార్షికోత్సవంలో భాగంగా సంస్థ ఈ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది.సంస్థలో పనిచేస్తున్న నైపుణ్యం కలిగిన వ్యక్తులను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించినట్లు కంపెనీ సీఈవో కళ్యాన్ కృష్ణమూర్తి తెలిపారు. సీఈవో ఆఫ్ ది డే సందర్భంగా మంగళవారం సీఈవో హోదాలో పద్మిని అన్ని రకాల సమావేశాలను నిర్వహించినట్లు, ముఖ్యంగా కీలక వాటాదారుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిందని కృష్ణమూర్తి వెల్లడించారు.
ఈ సందర్భంగా పద్మిని మాట్లాడుతూ..ఫ్లిప్‌కార్ట్ సీఈవో కృష్ణమూర్తితో అల్పాహారం చేశానని, రోజువారి కార్యక్రమాల్లో భాగంగా కళ్యాన్ నిర్వహిస్తున్న పలు సమావేశాలకు హాజరయ్యాయని చెప్పారు. సహ ఉద్యోగులకు పరిచయం చేయడం గొప్పగా అనిపించిందని, వారితో కలిసి పనిచేయడం అద్భుతమైన శిక్షణ అనుభవం కలిగిందన్నారు. కృష్ణమూర్తిపై ఆమె స్పందిస్తూ.. కఠినమైన బాస్, వినయపూర్వకమైన వ్యక్తి అని పేర్కొంది.