Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మూడు లక్షల మొక్కలకు ప్రాణం పోసిన లెక్కల మాస్టారు

Category : editorial state

నూటికో కోటికో ఒక్కరు ఉంటారు మానవాళి మనుగడ గురించి ఆలోచించేవారు. అలాంటి వాళ్ళు ఉండే వరకే ఇంకా మనం ఈ భూమి మీద మనుగడ సాధించగలుగుతున్నాం. అలాంటి గొప్ప వ్యక్తి అయినా ఓ లెక్కల మాస్టర్ గురించి వింటే మనకు ఆశ్చర్యం కలగకమానదు. సాధారణంగా లెక్కల్లో కూడికలు తీసివేతలు చెప్తారు. ఇక ఈ లెక్కల మాస్టారు మాత్రం పర్యావరణంలో కూడికలు తీసివేతలు బోధించారు. అదేంటి అనుకుంటున్నారా. అయితే ఈ స్టోరీ లో కుక్క లుక్కేయండి.

ఆయన గణితం బోధిస్తారు. అందుకే ఎక్కడ కూడాలో... ఎక్కడ తీసేయాలో బాగా తెలుసు. ప్రకృతికి పచ్చదనాన్ని కూడుతున్నారు. వాతావరణం నుంచి కాలుష్యాన్ని తీసేస్తున్నారు. పనిచేసిన ప్రతి పాఠశాలలో చెట్లను పెంచుతూ.. లెక్కల మాస్టారు కాస్తా మొక్కల మాస్టారు అయ్యారు.చెట్లను కొట్టేస్తున్నారు. రసాయనిక ఎరువులు ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తున్నారు. ప్లాస్టిక్‌ యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. పర్యావరణాన్ని వీలైనన్ని మార్గాల్లో కలుషితం చేస్తున్నారు. ఫలితంగా తీవ్ర వర్షాభావం, వరదలు, వరుస కరవులు. ఇవన్నీ చూసి, అనుభవించాడాయన. ఈ దుస్థితికి పరిష్కారం కనుక్కోలేమా? అనే ప్రశ్న ఆయన మెదడులో మొగ్గు తొడిగింది. మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టేలా చేసింది. అనంతపురం జిల్లా బూదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణితశాస్త్ర ఉపాధ్యాయుడు రెడ్డివారి శంకరనారాయణ ఎంఏ, ఎంఈడీ చేశారు.

ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరిన వెంటనే మొక్కలు నాటడం మొదలుపెట్టారు. రెండున్నర దశాబ్దాలు గడిచే సరికే.. మూడు లక్షల మొక్కలు ఆయన చేతులతో ప్రాణం పోసుకున్నాయి. చెట్లుగా ఎదిగాయి. ఎందరికో ఊపిరిపోస్తున్నాయి. ప్రకృతికి ప్రాణమిస్తున్నాయి. ఇదంతా సొంత ఖర్చులతో చేస్తుంటారాయన. ఎండాకాలంలో మొక్కలకు నీళ్లు పోయడానికి ట్యాంకర్‌ మాట్లాడుకొని పాఠశాలలు తిరుగుతారు. గ్రామాల్లో చైతన్యం తీసుకురావడానికి పిల్లలతో హరిత ర్యాలీలు నిర్వహిస్తుంటారు. మంచి పని చేయాలని తలపెడితే సహకరించే చేతులు జట్టు కడుతాయి. అలా ఆయన దృఢసంకల్పానికి మైరాడా, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఎప్పుడడిగినా మొక్కలు అందించాయి. తనకల్లు మండలం కోటపల్లి, ఆగళి మండల కేంద్రం, సీకేపల్లి మండలంలోని వెల్దుర్తి, గోరంట్ల మండలంలోని పులేరుల్లో పనిచేసిన ఆయన అన్నిచోట్లా పచ్చదనం పంచారు. సర్కారు బడుల్లో ఆహ్లాదం పెంచారు.. పర్యావరణ పరిరక్షణ జాతీయ పురస్కారం ఆయన కృషికి కాసిన ఫలం. ఇలాఎన్నో ప్రశంసలు, అవార్డులు ఆయనను వరించాయి. ఇది ఈ లెక్కల మాస్టర్ ఘనత. పర్యావరణ పరిరక్షణ కోసం ఉపాధ్యాయ వృత్తిలో చేరిన నాటి నుండి ఇప్పటివరకు 3 లక్షల మొక్కలు అందువల్ల ప్రాణం పోసుకున్నాయంటే మామూలు విషయం కాదు.