//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాప్-10 ప్యాసింజర్ కార్లలో ఆరు మారుతివే

Category : business

దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో మారుతి సుజుకీ తన సత్తా కొనసాగిస్తున్నది. జూన్‌లో అమ్ముడైన టాప్-10 ప్యాసింజర్ వాహనాల్లో ఆరు మోడళ్లు మారుతివే. హ్యుందాయ్‌కి చెందిన రెండింటికి, రెనోకు చెందిన క్విడ్‌కు, టాటా టియాగోకు సైతం ఈ జాబితాలో చోటు లభించింది. 

జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన వస్తు, సేవా పన్నుతో(జీఎస్టీ) కార్ల ధరలు తగ్గుతాయన్న అంచనాతో కొనుగోలుదారులు వేచిచూసే ధోరణి అవలంభించారు. దీంతో అమ్మకాల్లో నిస్తేజం ఏర్పడింది. కేవలం మారుతి, హోండా కార్ల అమ్మకాల్లో స్వల్ప వృద్ధి నమోదుకాగా, టయోటా, రెనో, ఫోర్డ్‌లకు నిరాశే ఎదురైంది. అయినప్పటకీ ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. 

మారుతికి చెందిన ఆల్టో 14,856 యూనిట్లతో ఈ జాబితాలో తన తొలిస్థానాన్ని పదిలం చేసుకున్నది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో విక్రయించిన 15,750 యూనిట్లతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. గతేడాది మూడో స్థానంలో నిలిచిన గ్రాండ్‌ఐ10 ఈసారికిగాను రెండో స్థానానికి ఎగబాకింది. 

2016 జూన్‌లో ద్వితీయ స్థానంలో ఉన్న మారుతి డిజైర్ఈ సారికి మూడోస్థానంతో సరిపెట్టుకున్నది. వ్యాగన్ ఆర్ నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉన్న బాలెనో ఈసారి నాలుగు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకుంది. స్విఫ్ట్ మాత్రం ఐదో స్థానంలోనే కొనసాగింది. 

అంతక్రితం ఏడాది చివరి స్థానంలో ఉన్న విటారా బ్రెజ్జా గడిచిన నెలతో మూడుస్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌కు చేరుకుంది. హ్యుందాయ్‌కి చెందిన క్రెటా ఒక ర్యాంక్ తగ్గి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. 2016 జూన్‌లో ఐదో స్థానంలో ఉన్న క్విడ్ఈ సారి తొమ్మిదో స్థానానికి జారుకుంది. టాటా మోటార్స్‌కు చెందిన టియాగోను పదోస్థానం వరించింది.