13 ఏళ్ల బాలికను పెళ్లాడేందుకు 56 ఏళ్ల సర్పంచ్ హెలికాప్టర్లో బయలుదేరి వచ్చాడు.
అయితే బాలికను వివాహం చేసుకునేందుకు బంధువులతో కలిసి హెలికాప్టర్లో సర్పంచ్ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కలెక్టర్ అప్రమత్తమయ్యారు. వెంటనే ఓ బృందాన్ని పెళ్లి జరుగుతున్న చోటుకు పంపి హెలిప్యాడ్‌కు అనుమతి రద్దు చేసి వివాహాన్ని అడ్డుకున్నారు.
ఆశ్చర్యకరంగా ఉన్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. కైలారస్ తహసీల్ బహ్రాసా సర్పంచ్ జగన్నాథ్‌కు ఇది వరకే పెళ్లయింది. భార్య ఉండగానే బాలికతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లిలో హెలికాప్టర్‌ను వినియోగించుకునేందుకు కలెక్టర్ అనుమతి కూడా తీసుకున్నాడు.
అయితే ఆయనకు మొదటి భార్య ఉందని, ఇప్పుడు బాలికను పెళ్లాడబోతున్నాడని కలెక్టర్‌కు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. దీంతో హెలిప్యాడ్‌కు ఇచ్చిన అనుమతిని రద్దు చేసిన కలెక్టర్ వివాహాన్ని అడ్డుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.