ఇంగ్లాండ్ లోని పారిశ్రామిక నగరం మాంచెస్టర్ ఆత్మాహుతి బాంబు దాడితో రక్తసికమైనది. అమెరికన్ పాప్ సింగర్ అరియనా గ్రాండే నిర్వహిస్తున్న సంగీత కచేరి ప్రాంతంలో ఈ దుర్ఘటన చేటుచేసుకున్నది. ఈ ఘటనలో సుమారు 19 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడినట్లు పోలీస్ యంత్రాంగం తెలిపింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సంగీత కచేరి లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన భద్రతా దళాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10: 35 గంటలకు పేలుడు సంభవించినట్లు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని, ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నట్లు బ్రిటన్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పాప్ సింగర్ అరియానాకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆమె క్షేమంగా ఉన్నారని ఆమె ప్రతినిధి ప్రకటించారు.