తమ దేశంలో ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ అభ్యర్థించారు. భారత్‌లో పర్యటిస్తున్న మాల్కమ్, మంగళవారం ఇక్కడి టీసీఎస్ ప్రాంగణాన్ని సందర్శించారు. తన బృందంతో కలిసి దిల్లీలో పర్యటించిన ఆస్ట్రేలియా ప్రధాని, ఇక్కడకు వచ్చిన వెంటనే టీసీఎస్ ప్రాంగణానికి వెళ్లారు. రిటైల్, ఆర్థిక సేవల రంగాల్లో తాము చేపట్టిన వినూత్న ఆవిష్కరణలను టీసీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) రాజేశ్ గోపీనాథన్ ఆస్ట్రేలియా బృందానికి చూపారు. ఇవన్నీ కూడా ముంబయి, చెన్నైలలోని ప్రత్యేక పరిశోధనా శాల (ల్యాబ్)ల్లో నిర్వహించినట్లు వివరించారు. ఈ సందర్భంలోనే, ఇలాంటి ల్యాబ్‌నే తమ దేశంలో ఏర్పాటు చేయాలని ఆస్ట్రేలియా ప్రధాని టీసీఎస్ యాజమాన్యాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. ఇందువల్ల వినూత్న ఉపాధి అవకాశాలు, వృద్ధికి అవకాశం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం టీసీఎస్ ఉన్నతాధికారులు, ఆస్ట్రేలియా బృందం ప్రత్యేకంగా సమావేశమై, చర్చించారు. దాదాపు గంటసేపు టీసీఎస్ ప్రాంగణంలో గడిపిన ఆస్ట్రేలియా ప్రధాని విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆస్ట్రేలియా దిగ్గజ కంపెనీలకు తాము అందిస్తున్న సేవలను వివరించామని, మహిళలకు సాంకేతిక విద్య అందించేందుకు, ప్రభుత్వ శాఖల్లో సాంకేతికత పెంపుపై ఆస్ట్రేలియా ప్రధాని ఆసక్తి చూపారని గోపీనాధన్ వివరించారు.