457 వర్క్ వీసాను రద్దు చేసిన ఆస్ట్రేలియా తాజాగా ఆస్ట్రేలియా పౌరసత్వ చట్టంలో మార్పులు చేసింది. నూతనంగా రూపొందించిన చట్టం ప్రకారం ఆసీస్ పౌరసత్వం పొందాలంటే కనీసం నాలుగేళ్లు తప్పనిసరిగా ఆ దేశంలో శాశ్వత నివాసితులై ఉండటంతో పాటు ఆంగ్ల భాషపై ప్రావిణ్యం తప్పనిసరి. ఇంతకు ముందు ఇది 1 సంవత్సరం నివాసిత నిబంధనగా ఉండేది. అంతేకాకుండా ఆస్ట్రేలియా విలువలకి కట్టుబడివుండాలని ప్రధాని మాల్కమ్ టర్న్ బుల్ వెల్లడించారు. దీనితో పాటు పౌరసత్వం పొందేందుకు ఇప్పటి వరకు ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకొనే అవకాశం ఉండేది. కానీ ఇప్పడు తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం మూడుసార్లు పరీక్షల్లో విఫలమైతే మళ్ళీ రెండేళ్ల వరకు పరీక్ష రాసే అవకాశం ఉండదు. కఠినమైన ఆంగ్లభాష పరీక్షలో ఉత్తీర్ణులవటంతో పాటు, బాల్య వివాహాలు, గృహహింస, ఆస్ట్రేలియా విలువలపై పరీక్షించనున్నట్లు టర్నబుల్ తెలిపాడు.
"పౌరసత్వం మా దేశానికి హృదయం వంటిది. ప్రజాస్వామ్యానికి పునాది. నేర ప్రవృతి, గృహ హింస వంటివి ఆసీస్ విలువలను దెబ్బతీసేవని, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే పౌరసత్వ కార్యక్రమాలను రూపొందిస్తాం" అని ప్రధాని టర్నబుల్ స్పష్టం చేశారు.