Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మలేషియాలో ఉద్యోగాల పేరుతో మోసం .. జాబ్ వీసా పేరుతో కోట్లు కాజేసిన కేటుగాళ్ళు

Category : world

నిరుద్యోగులే టార్గెట్ గా మరో మోసం వెలుగు చూసింది .మలేషియాలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల బలహీనతను ఆసరా చేసుకుని మోసానికి పాల్పడ్డారు నకిలీ జాబ్ కన్సల్టెన్సీ నిర్వాహకులు. ఉద్యోగాల్లిపిస్తామని దందాలు చేసి కోట్లలో ప్రజల సొమ్ము కాజేశారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసే నకిలీ కన్సల్టెన్సీ నిర్వాహకులను వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మార్చి 5 అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 15 ఇండియన్ పాస్‌పోర్టులు..మూడు ల్యాప్‌టాప్‌లు..76 మలేషియా సిమ్ కార్డులు..ఎనిమిది సెల్ ఫోన్లు..రూ.11,400 నగదు స్వాధీనం చేసుకున్నారు.

సౌరభ్ కుమార్ జా అలియాస్ సౌరభ్ నగరంలోని ఆసిఫ్ నగర్‌లో నివాసముంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఎండి ఇబ్రహిం అలియాస్అలియాస్ బాబాతో కలిసి ‘‘ఎఐఎం గ్రోత్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్’’ పేరుతో నకిలీ జాబ్ కన్సల్టెన్సీని 2018 ఏప్రిల్‌లో ప్రారంభించాడు. కంపెనీకి మేనేజర్ గా ఇబ్రహింను అతడి కుమార్తె అస్మాను రిసెప్షనిస్టుగా పెట్టుకున్నాడు. ఇబ్రహిం 1993లో బతుకు దెరువు కోసం దుబాయ్‌కు వెళ్లి 1996లో ఇండియాకు వచ్చాడు. ఈ క్రమంలో సౌరభ్, ఇబ్రహీం కలిసి మలేషియాలో ఉద్యోగాలు ఉన్నాయని నెలకు రూ.50,000 నుంచి లక్ష వరకు సంపాదించవచ్చని చెప్పి నిరుద్యోగుల నుంచి 75వేల నుంచి రూ.1,50,000 వసూలు చేశారు. యూట్యూబ్‌లో వీడియో ప్రకటనలు ఇచ్చారు.

వీటిని నమ్మిన పలువురు నిరుద్యోగులు మలేషియాలో ప్యాకింగ్ మ్యాన్, క్లీనింగ్ మ్యాన్, సేల్స్ మ్యాన్ తదితర ఉద్యోగాలు చేసేందుకు డబ్బులు కట్టారు. సౌరభ్‌కుమార్, ఇబ్రహిం అలియాస్ బాబా నిరుద్యోగులకు ఇంటర్వూలు నిర్వహించారు. తర్వాత వారికి వీసా, విమానం టిక్కట్, మలేషియా సిమ్ కార్డులు, రిటన్ టికెట్లు ఇచ్చారు. తమకు విజిటింగ్ వీసా ఇచ్చారని ప్రశ్నించిన వారికి మీరు అక్కడికి వెళ్లిన తర్వాత ఓ వ్యక్తి వచ్చి జాబ్ వీసా ఇస్తాడని చెప్పారు. ఈ విధంగా 30 నుంచి 40 మంది నిరుద్యోగులను మోసం చేశారు.

విజిటింగ్ వీసాపై అక్కడికి వెళ్లిన నిరుద్యోగులకు రెండు రోజులవుతున్నా జాబ్ వీసా ఇవ్వకపోవడంతో హైదరాబాద్ లోని బంధువులకు సమాచారం అందించారు. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. జాబ్ కన్సల్టెన్సీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వీరి బారిన ఇంకా ఎంత మంది పడ్డారో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Related News