//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మళ్ళి పెరుగనున్న లగ్జరీ కార్ల ధరలు

Category : business

జీఎస్టీ  అమలుతో భారీగా తగ్గిన లగ్జరీ కార్ల ధరలు మళ్లీ పెరుగనున్నాయి. మధ్యస్థాయి, భారీ, లగ్జరీ కార్లతోపాటు హైబ్రిడ్ మోడళ్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్‌పై (ఎస్‌యూవీ) గరిష్ఠ సెస్సు పరిమితిని 15 శాతం నుంచి 25 శాతానికి పెంచేందుకు వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన ఫలితంగా బడా కార్ల ధరలు రూ.3 లక్షల వరకు తగ్గాయి.

అయితే, కొత్త పరోక్ష పన్నుల విధానంలో సాధారణ వస్తువుల రేట్లు మాత్రం గతంలో కంటే పెరిగాయి. ఈ వైపరీత్యాన్ని చక్కదిద్దేందుకే పెద్ద కార్లపై శిస్తు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. అయితే, ఏ విభాగ కారుపై ఎంత శిస్తు విధించాలి, పెంపును ఎప్పటినుంచి అమలు చేయాలనేది జీఎస్టీ మండలి నిర్ణయిస్తుందని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈనెల 9న హైదరాబాద్‌లో అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కాబోతున్నది.

విలాస వస్తువుల ధరలు తగ్గి, నిత్యావసరాలు ప్రియం కావడం జీఎస్టీ ఉద్దేశం కారాదని జైట్లీ స్పష్టం చేశారు. ఒకవేళ పన్నుల ఊరట ఇస్తే సాధారణ ప్రజలకివ్వాలి గానీ లగ్జరీ ఉత్పత్తులపైన కాదని అన్నారు. రూ. కోటితో కారు కొనగలిగే వ్యక్తి రూ.1.20 కోట్లు వెచ్చించైనా ఆ వాహనాన్ని దక్కించుకోగలడు అని ఆయన పేర్కొన్నారు.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన డజనుకుపైగా పరోక్ష పన్నులన్నింటి స్థానంలో కేంద్రం జీఎస్టీని ప్రవేశపెట్టింది. కొత్త పరోక్ష పన్నుల విధానంలో కార్లపై 28 జీఎస్టీతోపాటు మోడల్‌ను బట్టి 1 నుంచి 15 శాతం సెస్సు కూడా చెల్లించాల్సి ఉంటుంది. సెస్సు వసూలు ద్వారా పోగైన నిధులను కార్పస్ ఫండ్‌గా ఏర్పాటు చేసి జీఎస్టీ అమలు కారణంగా నష్టపోతున్న రాష్ర్టాలకు కేంద్రం పరిహారం చెల్లించనుంది. జీఎస్టీ అమలుతో కార్లపై మొత్తం పన్ను భారం గత విధానంలో కంటే తగ్గింది.

కాగా, సెస్సు పెంపు నిర్ణయం భారత్‌లో లగ్జరీ, ఎస్‌యూవీ కార్ల విభాగ వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపనుందని మెర్సిడెజ్ బెంజ్, ఆడీ, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ (జేఎల్‌ఆర్)తోపాటు పలు ఆటో సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.