దేశంలో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లుపిన్ ఫార్మా వ్యవస్థాపకులు, చైర్మన్ దేశ్ బంధు గుప్తా సోమవారం ఉదయం ముంబైలో మరణించారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. గుప్తాకు భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 1968 లో ఫార్మా రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో లుపిన్ను స్థాపించారు. తర్వాత ఈ సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం సంస్థ 100కి పైగా దేశాల్లో ఔషధాలను విక్రయిస్తున్నది. ఈ రోజు ఉదయం తండ్రి(గుప్తా) ఈ లోకాన్ని విడిచి వెళ్లారన్న వార్త మమ్మల్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది అని లుపిన్ సీఈవో వినితా గుప్తా, ఎండీ నిలేష్ గుప్తాలు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ..గుప్తా మరణం అకస్మాత్తుగా జరిగిందని, చివరి రోజు వరకు సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడానికి ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. రాజస్థాన్లోని రాజ్గఢ్లో జన్మించిన గుప్తా.. ఎమ్మెస్సీ కెమిస్టీలో పట్టా అందుకున్నారు.