పాకిస్థాన్‌లోని 20 ఉగ్రవాద సంస్థల జాబితాను అమెరికా ఆ దేశానికి ఇచ్చింది. ఈ విషయాన్ని ప్రముఖ పాకిస్థాన్ పత్రిక డాన్ తన కథనంలో ప్రచురించింది. ఎల్ఈటీ, జేఈఎం, హక్కానీ నెట్‌వర్క్‌తో పాటు పలు ఉగ్రవాద సంస్థల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో మొదటి స్థానంలో హక్కాని నెట్వర్క్ ఉంది. పాక్‌లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని భారత్, అఫ్గానిస్థాన్‌లో ఆయా ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడుతోందని అమెరికా పేర్కొంది.
ఈ జాబితాలో ఉగ్రవాద సంస్థలను మూడు రకాలుగా అమెరికా విభజించింది. 'అఫ్గానిస్థాన్‌లో దాడులు చేస్తున్న సంస్థలు', 'పాకిస్థాన్ లోపలే ఉంటూ దాడులు చేస్తున్న వాళ్లు', 'కశ్మీర్‌పై దృష్టిసారించి అక్కడ దాడులు చేస్తున్న సంస్థ'లంటూ మూడు రకాలుగా జాబితాను రూపొందించింది.ఈ జాబితాలో హరాక్తుల్ ముజాహిద్దీన్, జైషే ఈ మొహ్మద్(జేఈఎం), లష్కరే తొయిబా(ఎల్ఈటీ), హరాక్తుల్ జిహాదీ-ఐ-ఇస్లామి, జమాతుల్ అహ్రర్, జమాతుద్ దవా అల్-ఖురాన్, తారిఖ్ గిదార్ గ్రూప్‌తో పాటు పలు ఉగ్రసంస్థల పేర్లు ఉన్నాయి.
పాక్‌కు చెందిన ముజాహిద్దీన్ కశ్మీర్లో ఉగ్రదాడులకు పాల్పడుతున్నట్లు అమెరికా పేర్కొంది. ఈ సంస్థకు ఒసామా బిన్ లాడెన్, అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జేఈఎం కూడా కశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకొనే దాడులకు పాల్పడుతోంది. దక్షిణాసియాలో ఎల్ఈటీ అతిపెద్ద, అత్యంత చురుకైన తీవ్రవాద సంస్థగా అమెరికా పేర్కొంది. ఈ తీవ్రవాద సంస్థలు పాకిస్థాన్‌లోను మారణహోమాలు సృష్టిస్తూ.. వందల మందిని ప్రాణాలను బలిగొంటున్నారని అమెరికా ఆరోపిస్తోంది. తరీఖ్ గిదార్ గ్రూప్ 2014, డిసెంబరు 16న పెషావర్‌లోని సైనిక పాఠశాలపై దాడి చేసిన మారణహోమం సృష్టించి 132 మంది చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది.
ఇటీవల పాక్ పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ 75 మంది తీవ్రవాదుల జాబితాను ఆ దేశానికి ఇచ్చినట్లు తెలిపారు. పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా నిలిచిందని, వారిపై చర్యలు తీసుకోకపోతే ఆ దేశమే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని టిల్లర్సన్ హెచ్చరించారు. ఉగ్రవాదులను నియంత్రించడంలో పాక్ విఫలమైతే యూఎస్ రంగంలోకి దిగి వేరే వ్యూహాల ద్వారా వారిని అడ్డుకుంటుందని కూడా ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే.