//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లింబోస్కేటింగ్ బాలునిలో ఒలింపిక్ పతకం కోసం కసి !

Category : sports

అతడు బుడతడు కాడు. చిరుత. రెప్పపాటులో మెరుపు వేగంతో వాహనాల కింది నుంచి వాయువేగంతో దూసుకెళతాడు. చూపరులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పసివాడే కానీ రికార్డులు సాధించాలన్న కసి ఉన్నవాడు. ఆ బాలుడే మాస్టర్ దేవిశ్రీ ప్రసాద్. తిరుపతి సిల్వర్ బెల్స్ సెంట్రల్ స్కూలులో చదువుతున్న బాలునికి జూలై ఏడో తేదీకి పదేళ్లు నిండటంతో లింబో స్కేటింగ్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఈవెంట్‌కు అర్హత సాధించాడు.

స్కేటింగ్, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రికార్డులు సృష్టిస్తే ప్రోత్సహిస్తానని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాలుడి గిన్నిస్ బుక్ ఈవెంట్‌కు ప్రభుత్వం రూ.16,90,000 ప్రభుత్వం చెల్లించింది. తల్లి,తండ్రితో వచ్చిన మాస్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనకు సహాయం చేసి ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఎప్పటికైనా ఒలింపిక్ పతకం సాధించాలన్నది తన జీవితాశయమని ఆ బాలుడు చెబుతుంటే ముఖ్యమంత్రి మురిసిపోతూ..అభినందించారు.

దేవిశ్రీ ప్రసాద్ గతంలో 4-6 వయస్సు విభాగంలో 2012లో ఉత్తరాఖండ్ లో జరిగిన ఆలిండియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఇన్ లైన్ రింక్ రేస్-1 లో వెండి పతకం, ఇన్ లైన్ రింక్ రేస్-2 లో బంగారు పతకం సాధించాడు. ఔరంగాబాద్ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ లో, మీరట్ లో నిర్వహించిన 15వ అఖిల భారత రోలర్ స్కేటింగ్ ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని పతకాల సాధించాడు.

ఈనెల 27 లేదా ఆ తర్వాత గుంటూరు సమీపంలో రామకృష్ణా హౌసింగ్ ప్రాంగణంలో నిర్వహించే లింబో స్కేటింగ్ లో అండర్ -10 విభాగంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈవెంట్ లో మాస్టర్ దేవిశ్రీ ప్రసాద్ పాల్గొనబోతున్నాడు. గిన్నిస్ బుక్ రికార్డు నమోదు వేడుకకు హాజరు కావాలని మంత్రి కొల్లు రవీంద్రను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇదిలా ఉంటే మాస్టర్ దేవిశ్రీప్రసాద్ ఆగస్టు 7 వ తేదీనుంచి బెల్జియంలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనబోతున్నాడు.

2007లో జన్మించిన మాస్టర్ దేవిశ్రీప్రసాద్ 2015లో తిరుపతి వేదవిశ్వవిద్యాలయం రహదారిలో రోమాంచిత విన్యాసంలో పాల్గొని ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. 26 టాటా సుమో కార్ల కింది నుంచి వెళుతూ 53.8 మీటర్ల దూరాన్ని 27.29 సెకెన్లలో దాటి చరిత్ర సృష్టించాడు.