ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఫ్రీ ఫోన్ బుకింగ్ సమయం రానేవచ్చింది. గురువారం నుంచి దీని బుకింగ్స్ ప్రారంభమయింది. జులై 21న రిలయన్స్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇండియా స్మార్ట్‌ఫోన్ అంటూ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ ఫోన్‌ను పరిచయం చేశారు.
ఫ్రీ ఫోనే అయినా ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని, మూడేళ్ల తర్వాత ఆ డబ్బును తిరిగి వినియోగదారులకే ఇస్తామని జియో ప్రకటించింది. ప్రకటించిన నాటి నుంచి ఫోన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
గురువారం నుంచి ఆఫ్‌లైన్, ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే, బుకింగ్ సమయంలోనే సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని కట్టాలా? ఇంకా ఏమేం వివరాలు ఇవ్వాలి? ఎక్కడ బుక్ చేసుకోవాలి? వంటి సందేహాలు రావచ్చు. బుకింగ్ సమయంలో కేవలం మీ వివరాలు మాత్రమే నమోదు చేస్తే సరిపోతుంది. ఫోన్ మీ చేతికి అందిన వెంటనే రూ.1500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక బుకింగ్స్‌ను ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం..
ఆఫ్‌లైన్‌లో బుకింగ్స్ ఎలాగంటే..?
* జియో అవుట్లెట్ లేదా జియోఫోన్లు విక్రయించే అధికారిక దుకాణాల్లో మాత్రమే ఈ బుకింగ్ చేసుకోవచ్చు.
* బుకింగ్ సమయంలో ఆధార్ కార్డు అవసరం. ఒక ఆధార్ నంబరుపై ఒక ఫోన్ మాత్రమే ఇస్తారు.
* ఆధార్ వివరాలు, వ్యక్తిగత సమాచారం నమోదు చేసిన తర్వాత మీకో టోకెన్ నంబర్‌ను ఇస్తారు.
* ఈ టోకెన్ నెంబరు ఫోన్ డెలివరీ సమయంలో అవసరమవుతుంది.
ఆన్లైన్లో..
* ఆన్లైన్లో బుకింగ్ కోసం జియో.కామ్ లేదా జియో ఫ్రీ ఫోన్.ఆర్గ్ సైట్లోకి వెళ్లాలి.
* సైట్లోకి వెళ్లాక ఫ్రీ మొబైల్ ఫోన్ రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి.
* అక్కడ పేరు, వ్యక్తిగత వివరాలు, ఆధార్ నంబర్, చిరునామా నమోదు చేయాల్సి ఉంటుంది.
* ఫస్ట్ కం ఫస్ట్ సర్వీస్ ఆధారంగా ఫోన్ డెలివరీ చేస్తారు. సెప్టెంబర్‌లో ఫోన్ మీ చేతికి అందుతుంది.