వ్యక్తి వయసును, వారి ఆరోగ్యాన్ని బట్టి ఇప్పటి వరకు డాక్టర్లు వారి ఆయుష్షు గురించి చెప్పేవారు. మనిషి శరీరాంతర్భాగాల చిత్రాలు(బయలాజికల్ ఇమేజెస్)ను చూసి ఆ వ్యక్తి ఎంతకాలం బతుకుతాడో తెలిపే కృత్రిమ మేధో సాంకేతిక (ఏఐ) వ్యవస్థను శాస్త్రవేత్తలు ఇపుడు రూపొందించారు.
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ యూనివర్సిటీ పరిశోధక బృందంలోని ఈ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ వ్యవస్థ 48 మంది రోగుల ఛాతీ భాగాల చిత్రాలను చూసి వారిలో ఎందరు ఐదేండ్లలో చనిపోతారో తేల్చి చెప్పారు. డాక్టర్ల విశ్లేషణతో పోల్చితే ఈ విధానంలో వేసే అంచనాలు 69 శాతం ఖచ్చితత్వంతో ఉంటున్నాయని నిర్ధారణ చేశారు.
ఇందుకు సంబంధించిన అధ్యయనం సైంటిఫిక్ జర్నల్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైంది. ఈ కృత్రిమ మేధోవ్యవస్థ రోగాలను వేగంగా నిర్ధారించడానికి, త్వరగా చికిత్సను అందించడానికి దోహదపడుతుందని కూడా భావిస్తున్నారు.
ఇదివరలో శరీరాంతర్భాగాలను, వాటన్నిటి సంపూర్ణ ఆరోగ్యాన్ని గురించి ఇంత విశ్లేషణాత్మాకంగా చెప్పలేకపోయేవారని, తాము రూపొందించిన లోతైన అధ్యయన విధానం ఇందుకు తోడ్పడుతుందని పరిశోధక విద్యార్థి ల్యూక్ ఓక్డెన్ రేనర్ తెలిపారు. ఈ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా శరీరాంతర్భాగాల చిత్రాలను అధ్యయనం చేసి కంప్యూటర్లు రోగులకున్న కాంగెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి క్లిష్టమైన జబ్బులను గుర్తించ గలుగుతున్నాయని కూడా రేనర్ చెప్పారు.