ఉత్తర్ ప్రదేశ్‌లో శాంతి భద్రతలను మెరుగ్గా నిర్వహిస్తామని, ఉత్తమ్ ప్రదేశ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో అభయం ఇచ్చిన యోగి ఆదిత్యానాథ్ సుమారు రెండు నెలల పాలనలో ఈ విషయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారా అనే అనుమానం కలుగుతున్నది. పరిస్థితులను అదుపులోకి తేవదానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించక పోవడంతో దిక్కుతోచడం లేదు.
ఇరు వర్గాల మధ్య ఘర్షణలతో నెల రోజుల నుంచి సహరన్పూర్ జిల్లా అట్టుడికిపోతున్నది. ఇక్కడ చెలరేగిన ఘర్షణల్లో ఓ వ్యక్తి మరణించడంతో పాటు పలువురికి గాయాలు కాగా, పలు ఇండ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్దసంఖ్యలో అదుపులోకి తీసుకుని, డీజీపీ సహా సీనియర్ పోలీస్ అధికారులు సందర్శించినా హింస ప్రజ్వరిల్లిన జిల్లాలో ప్రశాంతత నెలకొనలేదు. పోలీసులపై ఇప్పటికీ దాడులు జరగడం, పోలీస్ వాహనాలకు నిప్పుపెట్టడం కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక రాష్ట్ర రాజధాని లక్నో నేరాలకు నిలయంగా, అభద్రతకు ఆవాసంగా మారిందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఇదివరలో సహితం నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నా గత రెండు నెలల్లో మరింతగా పెరిగాయని ఆందోళన వ్యక్తం అవుతున్నది. రాజధానిలో నేరాలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పోలీసు అధికారులను పెద్దఎత్తున మార్చినా చెప్పుకోదగిన ఫలితం కనిపించడం లేదు.
ఇటీవలే డీజీపీని మార్చారు. యూపీలో ఈ ఏడాది జనవరిలో 16 దోపిడీలు జరగ్గా మార్చిలో 23 ఘటనలు, ఏప్రిల్‌లో 33 దోపిడీలు చోటుచేసుకున్నాయి. ఇక జనవరిలో 286 హత్యలు జరిగితే మార్చిలో ఈ సంఖ్య 396, ఏప్రిల్‌లో ఏకంగా 399 హత్యలు జరిగాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకే కాదు, గత ఏడాదితో పోల్చినా నేరాల సంఖ్య పెరగడం ఆందోళన రేకెత్తిస్తున్నది.
ఉత్తర్‌ప్రదేశ్ అంతటా ఆందోళనకరంగా నేరాల సంఖ్య పెరిగిపోతున్నా పోలీస్ ఉన్నతాధికారులు మాత్రం నేరాల రేటు క్రమంగా తగ్గుతున్నదనే చెబుతున్నారు. నేరాలను నియంత్రించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. అక్రమ మైనింగ్‌ను అరికట్టడంతో వ్యవస్థీకృత నేరాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. అయినా నేరాలు అదుపులోకి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు.