నాలుగు అరబ్ దేశాలు బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కతార్తో సంబంధాలు తెగతెంపులు చేసుకోవడంతో ఆ దేశం అష్ట దిగ్బంధనంలో చిక్కుకున్నట్లయింది. అరబ్ దేశాల మధ్య విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో భూ, వాయు, సముద్ర మార్గాలు మూసివేశారు. తీవ్రవాదానికి, ఇస్లామిక్ గ్రూపులకు మద్దతిస్తోందని ఆరోపిస్తూ ఈ నాలుగు అరబ్ దేశాలు కతార్తో దౌత్య సంబంధాలు తెంచుకున్నాయి.
తమ దౌత్య సిబ్బందిని 48 గంటల్లో వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించాయి. తమ దేశాలలో ఉన్నకతార్ దౌత్య సిబ్బంది, ఆ దేశ పౌరులను సహితం 48 గంటల్లో వెనుకకు వెళ్లిపోవాలని ఆదేశించాయి. ఇరాన్ తీవ్రవాద గ్రూపులకు నిధులు సమకూరుస్తున్నందుకు ఇరుగు పొరుగు దేశాలతో వుండాల్సిన సత్సంబంధాలు, నైతిక విలువలు, అంతర్జాతీయ సంబంధాలు, ఒప్పందాలు వీటినన్నింటినీ ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్నందుకు గానూ ఈ చర్య తీసుకుంటున్నట్లు బహ్రయిన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది.
ఆ వెనువెంటనే సౌదీ అరేబియా కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది. తీవ్రవాదం నుండి తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఈ చర్య తప్పదని స్పష్టం చేసింది. ఎమెన్లో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం నుండి కతార్ బలగాలను బహిష్కరించనున్నట్లు తెలిపింది. ఎమెన్లో సౌదీ నేతృత్వంలోని అరబ్ సంకీర్ణ కూటమి రెండేళ్ళుగా యుద్ధం చేస్తోంది. ఎమెన్లో అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన ప్రభుత్వం కూడా కతార్తో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించింది.
తాము కూడా కతార్తో దౌత్య సంబంధాలు తెంచుకుంటున్నట్లు ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించాయి. ఈ ప్రాంత సుస్థిరతకు భంగం కలిగించేలా కతార్ వ్యవహరిస్తోందని యుఎఇ ఆరోపించగా, తీవ్రవాద గ్రూపులకు మద్దతిస్తోందంటూ ఈజిప్ట్ ఆరోపించింది.
కాగా, అరబ్ దేశాలు తీసుకున్న ఈ నిర్ణయం సమర్థనీయం కాదంటూ కతార్ ఆందోళన వ్యక్తం చేసింది. ''వారి లక్ష్యం చాలా స్పష్టంగా తెలుస్తోంది. దేశాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలనుకున్నారు. ఇది కతార్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే.'' అని కతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.