//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మీడియా పై రుసరుసలు

Category : national

దాణా కుంభ‌కోణం కేసులో రాంచీలోని సీబీఐ కోర్టు తీర్పు వెల్ల‌డించింది. ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ను దోషిగా ప్ర‌క‌టించింది.

1990-97 మ‌ధ్య లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ బీహార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దాణా కొనుగోళ్ల‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో బీహార్‌లో దాణా కోసం మొత్తం రూ.900 కోట్లు ఖర్చు చేశారు. 1991 నుంచి 1994 మధ్య ట్రెజరీ నుంచి పశుదాణా కోసం అక్ర‌మంగా రూ.89 లక్షలు విత్‌డ్రా చేశారు. ఈ కేసులోనే సుదీర్ఘంగా వాద‌న‌లు జ‌రిగాయి. దాణా సరఫరా చేస్తున్నారని పేర్కొంటూ, లేని కంపెనీలను సృష్టించి వాటి పేరుతో డబ్బులు డ్రా చేశారని కోర్టు తేల్చింది.

ఈ కేసులో లాలూ స‌హా మొత్తం 15 మందిని దోషులుగా తేల్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మ‌రో ఏడుగురిని నిర్దోషులుగా తేల్చి చెప్పింది. నిర్దోషులుగా తేలిన వారిలో బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్నాథ్ మిశ్రా కూడా ఉన్నారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ స‌హా దోషులుగా తేలిన వారికి వ‌చ్చేనెల 3న శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నున్నారు.

ఈ కేసులో 15 మందిని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చడంతో వారిని బిర్సా మండా సెంట్ర‌ల్ జైలుకి త‌ర‌లిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జైలు బ‌య‌ట క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. కాగా, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ని సెంట్ర‌ల్ జైలుకి త‌ర‌లించే స‌మ‌యంలో విలేక‌రులు ఆయ‌న స్పందన తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, ప‌క్క‌కు జ‌ర‌గండంటూ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ వారిపై విసుక్కుంటూ వెళ్లారు. ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా పోలీసు వాహ‌నం ఎక్కి జైలుకి వెళ్లిపోయారు.