టీమిండియా క్రికెట్ కోచ్ గా 2019లో వరల్డ్ కప్ జరిగే వరకు అనిల్ కుంబ్లే నే కొనసాగించాలని బీసీసీఐ వర్గాలు నిర్ణయానికి వచ్చిన్నట్లు తెలుస్తున్నది. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తో పాటు పదిమంది ప్లేయర్లు కుంబ్లే ను మార్చ వలసిందే అని స్పష్టం చేసినా ముగ్గురు సీనియర్లతో కూడిన సలహా కమిటీ అతని కొనసాగింపుకే మొగ్గు చూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఇంగ్లాండ్ లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ ముగిసేలోపే కోచ్ ఎంపికను పూర్తి చేయాల్సి ఉన్నా దానిని త్వరలో భారత్ కు రానున్న వెస్టిండీస్ టూర్ వరకు వాయిదా వేయాలని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా కార్యదర్శి అమితాబ్ చౌదరికి లేఖ రాయడం గమనార్హం. భారత్ లో ఓ మేజర్ టోర్నీ ఆడుతున్న సమయంలో ఈ ప్రక్రియ కొనసాగించడం భావ్యం కాదని తాను అనుకున్నట్లు ఖన్నా చెప్పారు.
కోచ్ పదవికి పదిమంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. వారందరిని సలహాకమిటీ సభ్యులు సచిన్, లక్ష్మణ్, గంగూలీ ఇంటర్వ్యూ చేయవలసి ఉంది. గురువారం రాత్రి రెండు గంటల పాటు జరిగిన ఈ కమిటీ సమావేశంలో ఇంటర్వ్యూ షెడ్యూల్ ఖరారు చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే కుంబ్లేను కొనసాగించాలని ఒక అవగాహనకు రావడంతో మరెవ్వరిని ఇంటర్వ్యూ చేసే అవకాశం లేదని తెలుస్తున్నది.
రెండేళ్ల క్రితం కూడా ఈ ముగ్గురే రవి శాస్త్రిని కాదని కుంబ్లేను కోచ్ గా తీసుకొచ్చినది ఈ ముగ్గురే కావడం గమనార్హం. అయితే కుంబ్లే వ్యవహార శైలి పట్ల భారత్ జట్టులోని క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులకు ఉన్న విబేధాలను దృష్టిలో ఉంచుకొని కుంబ్లే పదవి కాలాన్ని పొడిగించక పోవడం పట్ల బీసీసీఐ లోని సీనియర్ అధికారులు సహితం విముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కొద్దీ వారల పాటు కోచ్ ఎంపిక అంశాన్ని వాయిదా వేయడం ద్వారా ఈ అంశం నుండి ఇతరుల ద్రుష్టి మళ్లించే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నారు.