Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కుంబల్ ఘర్ కోట

Category : national

భారతదేశం వివిధ సంస్కృతులకే కాదు అపురూప శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఇక్కడ ప్రసిద్ధి చెందిన క్షేత్రాలే కాదు చాలా విశిష్టమైన కట్టడాలు కూడా వున్నాయి. అద్భుత నిర్మాణ శైలితో అబ్బురపరిచే అతి పురాతన కోటలు కూడా ఉన్నాయి. పురాణ కాలంతో పాటు చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన ఎన్నో కట్టడాలను మనం ఈ దేశంలో చూడవచ్చు. అందులో కొన్ని అప్పటి శిల్పకళా వైభవానికి నిదర్శనాలుగా చెబుతారు. మరికొన్నింటిని అటప్పటి యుద్ద నైపుణ్యాలకు నిలయంగా నిర్మించారు. అటువంటి కోవకు చెందినదే కుంబల్ ఘర్ కోట. కుంబల్‌ఘర్ రాజస్థాన్ రాష్ట్రం లోని రాజ్‌సమంద్ జిల్లాలో అతి పురాతన ఆరావళి పర్వత శ్రేణుల్లో నిర్మింపబడిన కోట, ఇక్కడి కోట గోడ చుట్టూ గల ప్రాకారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన చైనా మహా కుడ్యము తర్వాత రెండవ అతి పెద్ద గోడగా ఖ్యాతికెక్కింది. కుంభాల్‌గఢ్ కోటతో పాటు, శిల్ప సౌందర్యం ఉట్టిపడే 300 అతి పురాతన హిందూ దేవాలయాలు చుట్టూ ఈ మహాకుఢ్యాన్ని నిర్మించారు. ఈ గోడ చైనా వాల్ ను తలపిస్తుంది. ఈ కోటకు సంబంధించిన మరిన్ని విశేషాలు మీ కోసం .

కుంబల్ ఘర్ కోట సముద్రమట్టానికి దాదాపు 1100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆరావళి పర్వతాల పై 15వ శతాబ్దంలో దీనిని నిర్మించారు. ఈ కోటను నిర్మించినది రాణా కుంభ. ఆయన పేరుమీదనే ఈ కోటకు కుంబల్ ఘర్ కోట అని పేరువచ్చింది. ఈ కోట రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఉదయ్‌పుర్‌కు 82 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఈ కోటకు అనేక విశిష్టతలు ఉన్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోనే పొడవు విషయంలో మొదటి స్థానంలో ఉంటే ఈ కుంబల్ ఘర్ కోట రెండో స్థానంలో ఉంటుంది. ఈ కోట మొత్తం పొడవు 36 కిలోమీటర్లు. వెడల్పు 15 అడుగులు. ఈ కోట రాజస్థాన్ శిల్పకళావైభవానికి నిదర్శనమని చెబుతారు.

ఈ కోటలో ఏడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. అదేవిధంగా అత్యంత సుందరమైన భవనాలు కూడా ఈ కోటలోపల ఉన్నాయి. ఇందులో బాదల్ మహల్ అత్యంత ముఖ్యమైనది. దీనిని రాణా పతేహ్ సింగ్ నిర్మించినట్లు చెబుతారు.ఈ కోటలోపల మెట్ల మార్గాలు చాలా చీకటిగా ఉంటాయి. శత్రుసైనికులను గందరగోళంలో పడేయడానికే ఈ ఏర్పాట్లని నిపుణులు చెబుతారు. ఈ కోట ప్రధాన ద్వారం వద్దకు చేరుకోవడానికి సుమారు ఒక కిలోమీటరు పొడవున్న మెట్లమార్గాన్ని అనుసరించాలి. ఈ కోట గోడ నిర్మించడానికి సంబంధించి అనేక స్థానిక కథనాలు వినిపిస్తాయి.రాణా కుంభ ఈ కోటను నిర్మించడానికి అనేకసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అటు పై బాడీ బాను సంప్రదించి అతను చెప్పినట్లు విని ఈ కోటను నిర్మించాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలు లేకపోయినా స్థానికులు మాత్రం ఇందుకు సంబంధించి అనేక కథనాలు వినిపిస్తారు. ఈ కోటను సందర్శించడానికి చాలా మంది నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో వస్తారు.

అప్పుడు ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా ఈ కోట పైన బాదల్ మహల్ వద్దకు చేరుకొంటే మేఘాల్లో తేలిపోయినట్లు ఉంటుంది. కుంభల్ ఘర్ కోట చుట్టూ ఉన్న అభయారణ్యం ప్రకృతి ప్రేమికులకు మంచి ఆటవిడుపు. ఇక్కడ సఫారీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ అంతరించే స్థితికి చేరుకొన్న ఎన్నో జంతువులను మనం చూడవచ్చు. మొత్తం ఈ కుంబల్ ఘర్ పర్యటన అటు చరిత్రలో తొంగిచూసినట్లు ఉండటమే కాకుండా ఇటు ప్రకృతితో మమేకం కావడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. ఇంత అపురూపమైన కోటను ఒకసారి తనివితీరా చూసెయ్యండి. ఒక మనోహరమైన ఫీలింగ్ లో తేలిపొండి.

Related News