//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

40 ఏళ్లలో తక్కువ ఆధిక్యత పొందిన రాష్ట్రపతిగా కోవింద్ !

Category : national

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామనాధ్ కోవింద్ ఘనవిజయం సాధించినా ఆయనకు వచ్చిన ఆధిక్యత మాత్రం 40 ఏళ్ళల్లో చాల తక్కువ కావడం గమనార్హం. మరో వంక ఆయనపై ఓటమి చెందిన యుపిఎ అభ్యర్థి మీరా కుమార్ కు లభించిన ఓట్లు 50 ఏళ్ళల్లో ఓటమి చెందిన అభ్యర్థులకు లభించిన అత్యధిక ఓట్లుగా రికార్డు నెలకొంది.

కోవింద్ కు 70 నుండి 75 శాతం వచ్చేటట్లు చేసుకోవాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విశ్వ ప్రయత్నం చేశారు. పలు రాష్ట్రాలలో క్రాస్ వోటింగ్ జరిగి, ప్రతిపక్ష సభ్యులు కూడా కొందరు ఆయనకు వోట్ వేసినా 65.65 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 1974 నుండి గెలుపొందిన రాష్ట్రపతి అభ్యర్థులు అందరికన్నా కోవింద్ కు తక్కువ ఓట్లు రావడం గమనార్హం. గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర చోట్ల ప్రతిపక్షాల ఓట్లు కొన్ని కోవింద్ కు లభించాయి. అయితే బీజేపీ ఓటర్లు సహితం రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లలో మీరా కుమారికి వేశారు.

2019లో గెలుపొందిన ప్రణబ్ ముఖర్జీ కి 69.31 శాతం, 2007లో గెలుపొందిన ప్రతిభ పాటిల్ కు 65.82 శాతం ఓట్లు లభించాయి. 2002లో ఏ పి జె అబ్దుల్ కలాంకు  89.57 శాతం ఓట్లు లభించగా, 1997లో కె ఆర్ నారాయణకు అత్యధికంగా 94.97శాతం ఓట్లు లభించాయి. 1992లో శంకర్ దయాల్ శర్మ కు 65.87 శాతం, 1987లో ఆర్ వెంకట్ రామన్ కు 72.28 శాతం, 1982లో జైలు సింగ్ కు 72.73 శాతం ఓట్లు లభించాయి. 1977 లో మాత్రం నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇలా ఉండగా,  ఓటమిలోనూ లోక్‌సభ మాజీ స్పీకర్‌  మీరా కుమార్ 50 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టి కొత్త రికార్డు సృష్టించారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వారిలో మీరాకుమార్‌ అత్యధిక ఓట్లు సాధించారు. 50ఏళ్ల కిందట భారత మాజీ ప్రధానన్యాయమూర్తి కోకా సుబ్బారావు ఈ ఘనత సాధించగా, ఇప్పుడు మీరాకుమార్‌ ఆ రికార్డును అధిగమించారు.

1967లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన కోకా సుబ్బారావుకు 3.63 లక్షల ఓట్లు సాధించారు. అప్పటి నుంచి ఓడిపోయిన అభ్యర్థికి ఎవరికీ అన్ని ఓట్లు రాలేదు. సరిగ్గా 50ఏళ్ల తర్వాత మీరాకుమార్‌ ఆ రికార్డును బద్దలుకొట్టి 3.67లక్షల ఓట్లు సాధించారు. అయితే ఓటు షేరు మాత్రం సుబ్బారావు కంటే తక్కువగానే ఉంది. 1967 ఎన్నికల్లో సుబ్బారావుకు 43 శాతం ఓటు షేరు రాగా, మీరాకుమార్‌కు కేవలం 34 శాతమే దక్కింది.