//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

౩ నెలలపాటు కోరమీసాల కొమురెల్లి మల్లన్న జాతర చూసొద్దాం రండి

Category : state editorial

కోరి కొలిచే వారి కొంగు బంగారమైన కొమురెల్లి మల్లన్న జాతర మొదలైంది. కోరమీసాల మలన్నకు సత్తేటి వారాల జాతర జరుగుతుంది. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా బ్రహ్మోత్సవాలు 3రోజుల నుంచి 9 రోజులు నిర్వహించడం పరిపాటి. కానీ కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు సుమారు మూడు నెలలు... సంక్రాంతి తరువాత వచ్చే ఆదివారం మొదలుకొని, ఫాల్గుణ మాసం చివరి ఆదివారం... అంటే ఉగాది ముందు వచ్చే ఆదివారం వరకూ కొనసాగుతాయి. అశేష భక్తజనంతో పాటు జోగినులు, శివసత్తుల సిగాలు, పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు దరువులు, బోనాలతో ఆలయ పరిసరాలు సందడిగా మారుతాయి. భక్తులు తమ కష్టాలు తీర్చిన స్వామి కోసం బోనం తయారు చేసి, పట్నాలు వేసి మొక్కులు తీర్చుకుంటారు. తమ పిల్లా పాపలనూ, పాడిపంటలనూ చల్లగా చూడాలని వేడుకుంటారు.

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా కొమురవల్లి మండల కేంద్రంలో ఉన్న మల్లికార్జున స్వామీ దేవాలయం హైదరాబాద్‌ నుంచి సుమారు 92 కి.మీ., సిద్ధిపేటకు 22 కి.మీ. దూరంలోఉంది. ఆ ప్రాంతాలనుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చు. జాతర సమయంలో మల్లన్న క్షేత్రం శోభాయమానంగా నిత్యం జనసందోహంతో కిటకిటలాడుతుంది.

ఇక క్షేత్ర ప్రాశస్త్యం గురించి చెప్పాలంటే 11వ శతాబ్దంలో కొమరవెల్లిలోని విజయాచలం గుట్టల్లో ఓ ముని తపస్సు చేయగా, శివలింగం వెలిసిందట! ఆ లింగంపై పెరిగిన పుట్టమన్నుతో మూలవిరాట్టును రూపొందించి, దాని నాభి ప్రదేశంలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించారన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. త్రిపురాసురులను శివుడు సంహరించిన పురాణ గాథను గుర్తు చేస్తూ, ఈ ఆలయంలో మల్లన్న పాదాల కింద ముగ్గురు రాక్షసుల తలలు ఉంటాయి.సాధారణంగా దేవాలయాలలోని ప్రధాన దేవతామూర్తులు తూర్పు వైపు తిరిగి ఉంటారు. కానీ మల్లన్న ఆలయంలో మూలవిరాట్టు పడమరవైపు ఉంటుంది. ఇక ఈ దేవాలయంలో నిర్వహించే పూజలు రెండు సాంప్రదాయాల్లో కనిపిస్తాయి. కొమురవెల్లి మల్లన్న వీరశైవులకు చెందిన మేడలాదేవీని వివాహమాడాడని చెబుతారు. వీరశైవాగమశాస్త్రం ప్రకారం గర్భాలయంలో వేద మంత్రోచ్ఛారణలతో ఆర్జితసేవలు నిర్వహిస్తారు. అలాగే యాదవుల ఆడబిడ్డ అయిన కేతలాదేవిని కూడా స్వామి పరిణయమాడారట! కాబట్టి యాదవులు పంచరంగులతో పట్నాలువేసి పూజలు జరుపుతారు.కొమురవెల్లి మల్లన్న వీరశైవులకు చెందిన మేడలాదేవీని వివాహమాడాడని చెబుతారు. వీరశైవాగమశాస్త్రం ప్రకారం గర్భాలయంలో వేద మంత్రోచ్ఛారణలతో ఆర్జితసేవలు నిర్వహిస్తారు. అలాగే యాదవుల ఆడబిడ్డ అయిన కేతలాదేవిని కూడా స్వామి పరిణయమాడారట! కాబట్టి యాదవులు పంచరంగులతో పట్నాలువేసి పూజలు జరుపుతారు. జనవరి 20 నుంచి మార్చి 31 వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

వీరశైవ సంప్రదాయం ప్రకారం వీరశైవార్చకులు మార్గశిర మాసంలో వేదమంత్రోచ్ఛారణలతో కల్యాణం చేస్తే, ఒగ్గు పూజారులు యాదవ సంప్రదాయం ప్రకారంగా మహాశివరాత్రి రోజున పట్నం (ముగ్గు) వేసి కల్యాణం జరుపుతారు. పసుపు, కుంకుమ, తెల్ల పిండి (వరిపిండి), సునేరు, పచ్చ... ఇలా అయిదు రంగుల పదార్ధాలను ప్రమధ గణాలకు ప్రతీకలుగా సమ్మిళితం చేసి, నిమ్మకాయతో చిత్ర కన్ను నెలకొల్పుతారు. 43 వరుసల్లో పట్నాన్ని వేసి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతారు. మల్లన్న, కేతలమ్మ, మేడలాదేవిలకు నూతన వస్త్రాలను సమర్పించి, సుంకు పడతారు (బియ్యాన్నీ, పసుపునూ కలిపి దంచుతారు). గొంగళిలో బియ్యంతో మైలపోలు (దిష్టి) తీస్తారు. స్వామివారు ధరించే త్రిశూలం, ఢమరుకాలను నెలకొల్పిన అనంతరం పెద్దపట్నం పైకి ఆవాహన చేస్తారు. నిమ్మకాయలు, గుమ్మడికాయలతో బలిహరణ చేస్తారు. తెల్లవారుజామునే గర్భాలయం నుంచి వీరశైవులు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పట్నం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. పట్నంపై చిందేస్తూభక్తులు తన్మయులవుతారు. స్వామివారిని దర్శించుకుంటారు. ఈ బ్రహ్మోత్సవాలు ఫాల్గుణమాసం చివరి ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమంతో ముగుస్తుంది. శివసత్తులు, భక్తులు మల్లన్న ఆవాహనతో అగ్నిగుండాలను దాటుతారు.

సంక్రాంతి తరువాత వచ్చే మొదటి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చి పట్నాలు వేసి బోనాలు నివేదించి పండుగ జరుపుతారు. దీన్ని ‘పట్నంవారం’ అని పిలుస్తారు. రెండోవారం సికింద్రాబాద్‌ నుంచి భక్తులు ఎక్కువగా వస్తారు. కాబట్టి ‘లష్కర్‌వారం’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. గతంలో కేవలం 3 నెలల కాలంలో ఏడు ఆదివారాల పాటు జాతర కొనసాగడంతో ‘సత్తేటి వారాల జాతర’గా పేరొందింది. కానీ తిథుల ఆధారంగా ఒక్కోసారి 12 వారాల వరకు జాతర కొనసాగుతుంది. ఈ ఏడాది 11 వారాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి..