తొలి నాలుగు ఓవర్లలోనే రాజస్థాన్ స్కోరు 59 పరుగులు.. బట్లర్ భీకర ఫామ్‌తో ఇక పరుగుల మోత ఖాయమే అనుకున్నారంతా. కానీ చివరి 15 ఓవర్లలో మొత్తం పది వికెట్లూ కోల్పోయి ఆ జట్టు చేసింది 83 పరుగులే.
ఏ విధంగా వారు విరుచుకుపడ్డారో ఈ గణాంకాలు చూస్తే తెలిసిపోతుంది. ముఖ్యంగా అంతగా ఆకట్టుకోలేకపోతున్న లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4/20) ఈసారి తన అసలైన సత్తా చూపుతూ ప్రత్యర్థిని వణికించాడు. దీంతో భారీ స్కోరు ఖాయమనుకున్న రాయల్స్ 142 పరుగుల వద్దే ఆగింది.
ఆ తర్వాత స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన కోల్‌కతాను రాజస్థాన్ బౌలర్లు కూడా కట్టడి చేయగలిగారు. తొలి ఓవర్లో నరైన్ విజృంభణ అనంతరం నెమ్మదిగానే వీరి ఇన్నింగ్స్ సాగింది. అయితే లిన్, దినేశ్ కార్తీక్ విలువైన ఇన్నింగ్స్‌తో చివరికి ఫలితం రాబట్టింది. దీంతో పాటు తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగానే ఉంచుకోగలిగింది. అటు బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో దెబ్బతిన్న రాజస్థాన్ ఏడు ఓటములతో సాంకేతికంగా రేసులోనే ఉన్నా ముందుకెళ్లడం కష్టమే.