వంకపెట్టడానికి వీలులేని మేటి కోచ్ అని ప్రపంచంలోని క్రికెట్ ప్రముఖులు కొనియాడుతున్న అనిల్ కుంబ్లేని పట్టుబట్టి భారత జట్టు కోచ్ గా తనకు తానే రాజీనామా చేసి వెళ్లిపోయేటట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేయడం మాజీ టీమ్ డైరెక్టర్ రవి శాస్త్రిని ఆ స్థానంలోకి తీసుకు రావడం కోసమే అని ఇప్పుడు స్పష్టం అవుతున్నది. అందుకు బిసిసిఐ లోని కొద్దిమంది సహకరించినట్లు కూడా వెల్లడి అవుతున్నది.
ఇప్పటికే కోచ్ పదవి కోసం దరఖాస్తులు స్వీకరించిన బీసీసీఐ తాజాగా మళ్ళీ దరఖాస్తులను ఆహ్వానించడం, ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూ కూడా చేయక పోవడం గమనిస్తే బలమైన వర్గం రవిశాస్త్రి కోసం పావులు కదుపుతున్నట్లు వెల్లడి అవుతున్నది. గత సంవత్సరం రవిశాస్త్రిని తొలగించి, ఆ స్థానంలో అనిల్ కుంబ్లే ను నియమించిన క్రికెట్ దిగ్గాజాలుగా పేరొందిన క్రికెట్ సలహా మండలి సభ్యులైన గంగూలీ, లక్ష్మణ్, సచిన్ ఇప్పుడు నిస్సహాయంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్లు కనిపిస్తున్నది.
పైగా ఇప్పుడు రవిశాస్త్రిని కూడా దరఖాస్తు చేసుకోమని బీసీసీఐ వర్గాలు కోరడం, " కచ్చితంగా నాకే ఆ పదవి ఇస్తా అంటేనే చేస్తా" అంటూ ఆయన బెట్టు చేయడం గమనిస్తే బీసీసీఐ లో క్రీడలు కన్నా రాజకీయాలు ఎంత అధ్వాన్నంగా రాజ్యమేలుతున్నాయో స్పష్టం అవుతుంది. అయితే గత సంవత్సరం రవిశాస్త్రి ఎంపిక కాకుండా అడ్డుపడ్డ గంగూలీ ఇప్పుడు సుముఖత వ్యక్తం చేస్తారా అన్నది ప్రశ్న.
గతేడాది ఇదే విషయమై రవిశాస్త్రి, గంగూలీ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. అధికారాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న గంగూలీ కుంబ్లేకే ఓటు వేశాడు. గంగూలీతో ఉన్న విభేదాల కారణంగా రవిశాస్త్రి కోచ్ అవడం అంత సులువైన పని కాకపోవచ్చని కొందరు భావిస్తున్నారు. శాస్త్రిలాగే గంగూలీ కూడా మొండి ఘటమే. అంత సులువుగా ఎవరికీ తల వంచడు. ఇటు ఈ ఇద్దరూ.. అటు కెప్టెన్ కోహ్లి మధ్య బీసీసీఐ నలిగిపోతున్నది.