ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా రికార్డు స్కోర్ సాధించింది. సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్‌ల వీరోచిత ఇన్నింగ్స్‌తో ఈ సీజన్లోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. మైదానంలో ఫోర్లు, సిక్సుల వర్షాన్ని కురిపిస్తూ.. స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. అయితే ఆండ్రూ టై వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి క్రిస్ లిన్(27) క్లీన్ బౌల్డ్ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత నరైన్ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ దశలో సునీల్ నరైన్ చెలరేగిపోయాడు.
36 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 75 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అండ్రూ టై వేసిన 12వ ఓవర్ మూడో బంతికి కీపర్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్ ఐదో బంతికి రాబిన్ ఉతప్ప(24) భారీ షాట్‌కు ప్రయత్నించి మోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
ఈ దశలో కెప్టెన్ దినేష్ కార్తీక్ రెచ్చిపోయాడు. ఆండ్రే రస్సెల్‌తో కలిసి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 22 బంతుల్లో ఐదు ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేసి బరీందర్ బౌలింగ్‌లో మిల్లర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు రస్సెల్ కూడా అంతే దూకుడుగా ఆడాడు. 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 31 పరుగులు చేసి కీపర్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆఖర్లో గిల్ మైదానంలో మెరుపులు మెరిపించడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్‌లో టై 4, మోహిత్, స్రాన్లు తలో వికెట్ తీశారు. కాగా ఐపీఎల్ చరిత్రలో ఈ స్కోర్ నాలుగో అత్యధిక స్కోర్ కావడం విశేషం