//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమ్మాయిలను కాపాడుకోండి.. అబ్బాయిలను కనిపెట్టండి ..కిరణ్ బేడీ పిలుపు

Category : national

"మీ కుమార్తెలను కాపాడుకుంటూ..మీ అబ్బాయిలు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండండి"  అంటూ పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నరు కిరణ్‌బేడి తల్లిదండ్రులను హెచ్చరించారు. హర్యాణాలోని  రోహ్‌తక్‌లో జరిగిన మరో నిర్భయ ఘటనపై బేడి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇటువంటి దుర్ఘటనలు నివారించే బాధ్యత తల్లితండ్రులదే అని స్పష్టం చేశారు. 

"మీ కొడుకులను సమాజానికి ఆస్తిగా ఇస్తారా.. లేదంటే సమాజానికి కీడు తలపెట్టే వ్యక్తిగా తయారు చేస్తారా అనేది తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి. ఆడపిల్లల సంరక్షణ, మగపిల్లలు పెరిగే విధానంపై తల్లిదండ్రులు దృష్టిసారించాలి" అని ఆమె హితవు చెప్పారు. 

 ప్రతి తల్లిదండ్రులు అమ్మాయి వద్దు అబ్బాయిలే కావాలని కోరుకుంటారు. మరి వాళ్లు ఎలా ఎదుగుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా పరీక్షించుకోవాలి గదా అని ఆమె గుర్తు చేశారు. మంచి నడవడికను వాళ్లకు నేర్పించినపుడే వాళ్లు సమాజానికి ఆస్తిగా తయారవుతారని ఆమె చెప్పారు. 

అమ్మాయిలు భద్రంగా ఉండాలి అనుకుంటూ వాళ్లని కొంతమంది ఇళ్లలోనే ఉంచుతున్నారని, అబ్బాయిలను మాత్రం బయటికి పంపిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేసారు. ఎందుకంటే అలా అబ్బాయిలను కట్టడి చేస్తే వాళ్లు ఎక్కడ ఎదురుతిరిగి ఇల్లు విడిచి వెళ్లిపోతారో మళ్లీ తిరిగి రాకుండా ఉంటారో అని భయమే అందుకు  కారణం అని ఆమె పేర్కొన్నారు. అలా చేయడం వల్ల వాళ్లు చెడు సావాసాలకు మరిగి తాగుబోతులుగా మారుతున్నారని కిరణ్ బేడీ ఆవేదన వ్యక్తం చేసారు. 

ఒక్కోసారి పిల్లలు తప్పుదారి పడుతున్నా మందలించకుండా ఉంటున్నారని అంటూ అటువంటి ఇళ్లలోని సొంత ఆడపిల్లలకే మగపిల్లల నుంచి భద్రత లేకుండా ఉంటుందని ఆమె విచారం వ్యక్తం చేసారు. "ఆడపిల్లలను రక్షిద్దాం.. ఆడపిల్లలను చదివిద్దాం.. అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా మీ కుమార్తెలను కాపాడుకొండి అనే నినాదాన్ని అమలుపరచాలి" అని ఉద్వేగభరితంగా బేడి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.