Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా కిరణ్ బేడి...కేంద్రం వ్యూహం ఇదేనా

Category : politics state

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ రానున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ గా వస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఉన్న ఆమె తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇక ఇంతకాలం తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించిన ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పై బదిలీ వేటు పడనుందని జోరుగా టాక్ వినిపిస్తోంది. రానున్న ఎన్నికల నేపథ్యంలోనే నరసింహన్ ను తొలగించి కిరణ్ బేడీని కేంద్రం రంగంలోకి దింపనుందని ప్రచారం జోరుగా సాగుతోంది.

మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తిరిగి గద్దెనెక్కాలని ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దానికి అనుగుణంగా ఇప్పటినుండి అడుగులు వేస్తోంది. ఇక ఏపీలో టిడిపి ను గద్దె దించాలని లక్ష్యంతో ఉన్న బిజెపి టీడీపీ టార్గెట్గా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీకి రంగం సిద్ధం కాడంతో ఆయన స్థానంలో కిరణ్ బేడీని పంపాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కిరణ్ బేడీ 1949 జూన్ 9న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో జన్మించారు. తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపుపొందారు. 1972లో ఐపీఎస్ కు ఎంపికైన ఆమె పోలీస్ శాఖలో అనేక పదవులు చేపట్టడంతోపాటు అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. అయితే బ్యూరో అఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం 2011లో అన్నాహజారే నేతృత్వంలో జరిగిన ఇండియన్ యాంటీ కరప్షన్ మూవ్ మెంట్ లో పాల్గొన్నారు. అనంతరం 2015 జనవరిలో భారతీయ జనతాపార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగారు. అది కాస్త బెడిసికొట్టింది. అనంతరం 2016 మే 22న ఆమెను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె పదవిలో కొనసాగుతున్నారు. పాలనా పరమైన అంశాలలో నిర్మొహమాటంగా వ్యవహరించే కిరణ్ బేడీని తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా పంపించడానికి కేంద్రంలోని బిజెపి సర్కార్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతుంది. ఇక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కిరణ్ బేడీ రాక ఏపీ సర్కార్ కు టెన్షన్ తెప్పిస్తోంది. ఇప్పటికే ఏపీ లోని ఎన్నికల ప్రధానాధికారిని మార్చి బీజేపీకి అనుకూలంగా ఉండే గోపాలకృష్ణ ద్వివేది ని నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

ఇక ఇప్పుడు బిజెపి నుండి ప్రాతినిధ్యం వహించిన కిరణ్ బేడీని గవర్నర్ గా పంపిస్తే ఎన్నికల సమయంలో ఇబ్బందులు పెడతారని, బీజేపీకి అనుకూలంగా ప్రవర్తిస్తారని టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సుదీర్ఘకాలం పనిచేసిన నరసింహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్ గా కొత్త తెలుగు రాష్ట్రాల తొలి గవర్నర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. అత్యధిక ముఖ్య మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన రికార్డు కూడా గవర్నర్ నరసింహన్ కు దక్కింది. ఆయన పదవీకాలం ఎప్పుడో పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ ఆయన కొనసాగుతుండటం విశేషం. కేంద్రంలోని కీలక శాఖ లో ఉన్న అధికారికి గవర్నర్ అత్యంత సన్నిహితుడు కావడం వల్ల ఆయనపై ఇప్పటివరకు బదిలీ వేటు పడలేదు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్ బదిలీతో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి.