తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ మరో చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్ లో ఇండియా తరుపున మొదటి రాంక్ పొందిన రెండవ వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఈ రోజు ప్రకటించిన జాబితాలో 76,895 పాయింట్లతో శ్రీకాంత్ తొలి స్థానంలో నిలిచాడు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అక్సెల్సన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నఈ తెలుగు తరపు మొక్కకి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ఎప్పుడూ అభినందించడానికి ముందుండే భారత్ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ తనదయిన రీతిలో శ్రీకాంత్ కి శుభాకాంక్షలు తెలిపారు. తొలి స్థానాన్ని సాధించిన రెండో భారతీయుడిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉందని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
భారతీయ క్రీడా రంగానికి ఈ రోజు గొప్పరోజు అని అన్నాడు గోపీచంద్ మాట్లాడుతూ, శ్రీకాంత్ కే కాకుండా భారత బ్యాడ్మింటన్ కు ఇదొక గొప్ప విజయమని చెప్పాడు. ఇప్పటి వరకు మనమంతా మహిళా క్రీడాకారుల గురించే మాట్లాడుకున్నామని, కానీ ఇప్పుడు మనకు మెన్స్ నెంబర్ వన్ కూడా ఉన్నాడని తెలిపాడు. రానున్న రోజుల్లో శ్రీకాంత్ మరింత మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తాడని చెప్పాడు.