ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తమవంతు సహకారం అందిస్తామని కియా మోటార్స్ సంస్థ అధ్యక్షుడు హాన్ వూ పార్క్ అన్నారు.ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా నుంచి 2019 ద్వితీయార్థంలో కియా కార్లను ఉత్పత్తి చేస్తామని ‘కియా మోటార్స్’ అధ్యక్షులు హాన్ వూ పార్క్ తెలిపారు. చిన్న కార్ల విపణిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్ల కంపెనీ ‘కియా మోటార్స్’ తాము ఆంధ్రప్రదేశ్‌లో తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గురువారం ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, కియా మోటార్స్ అధ్యక్షులు హాన్ వూ పార్క్‌లు ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద 600 ఎకరాల విస్తీర్ణంలో కియా కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఆ సంస్థ రూ.13వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.ఈ సందర్భంగా కార్ల తయారీ కంపెనీ అధ్యక్షుడు హాన్ వూ పార్క్ మాట్లాడుతూ.. కియా మోటార్స్ కార్ల తయారీ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
కియా కంపెనీతో బెస్ట్ ఎంవోయూ కుదుర్చుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పోటీ ఉన్నా కియా మోటార్స్‌ను రాష్ట్రానికి తీసుకురాగలిగామన్నారు. మెజారిటీ ఉద్యోగాలు స్ధానికులకే ఇచ్చేలా చూస్తామని, అవసరమైతే వారికి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇస్తామని చెప్పారు. గొల్లపల్లి రిజర్వాయర్ అందుబాటులో ఉండడంతో కియో కంపెనీ అనంతపురం జిల్లాకు వచ్చిందని స్పష్టం చేశారు.