//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మిథాలీరాజ్‌కు కేసీఆర్ రూ.కోటి నజరానా

Category : sports

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌కు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూ.కోటి నజరానా ప్రకటించారు. ప్రోత్సాహకంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 600 గజాలకు తక్కువ కాకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్టు చెప్పారు. కోచ్ మూర్తికి కూడా రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం అందించనున్నట్టు పేర్కొన్నారు. 

మహిళా క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చినందుకు, వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు మిథాలీరాజ్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న మిథాలీరాజ్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మిథాలీరాజ్‌తోపాటు కోచ్ ఆర్‌ఎస్‌ఆర్ మూర్తిని . సీఎం శాలువాకప్పి సన్మానించారు. మిథాలీని అద్భుత క్రికెటర్‌గా తీర్చిదిద్దారని కోచ్‌ను ప్రశంసించారు. 

"ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించారు. ఫైనల్‌దాకా వచ్చారు. ఫైనల్‌లో గెలువడం ఖాయం అనుకున్నాం. దురదృష్టవశాత్తు కొద్ది తేడాతో ఓడిపోయాం. అయినప్పటికీ మీ జట్టంతా అద్భుతంగా ఆడింది. నాతోపాటు దేశమంతా మీ ఆట చూసింది. అంతా మీకు మద్దతుగా నిలిచారు" అంటూ కేసీఆర్ కొనియాడారు. 

"ముఖ్యంగా టోర్నీలో బాగా ఆడి, అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డు సొంతం చేసుకున్నావు. హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి నువ్వు గర్వకారణం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి. వ్యక్తిగతంగా, తెలంగాణ ప్రజల తరఫున మనసారా అభినందనలు. ప్రభుత్వం.. నీకు అన్ని విధాలా అండగా ఉంటుంది" అని కేసీఆర్ భరోసా కల్పించారు.