Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టికెట్ ఇవ్వకుండా షాక్ ఇచ్చిన కేసీఆర్ ..ఎంపీ సీతారాం నాయక్ దారెటు

Category : state politics

గులాబీ బాస్ కేసీఆర్ సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ కు ఈ దఫా ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడానికి టిక్కెట్ ఇవ్వకుండా పెద్ద షాక్ ఇచ్చారు. ఇక మహబూబాబాద్ ఎంపీ స్థానం నుండి మాజీ మంత్రి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కుమార్తె, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత కు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాకతీయ యూనివర్సిటీ నుండి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ సీతారాంనాయక్ కు 2014 ఎన్నికల్లో ఊహించని విధంగా అవకాశం ఇచ్చిన కెసిఆర్ , ఈసారి ఎన్నికల్లో పోటీకి మాత్రం నో చెప్పేశారు. దీంతో ప్రస్తుతం సీతారాం నాయక్ చాలా నిరాశతో ఉన్నారు. గులాబీ బాస్ తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో అంతర్మధనానికి లోనవుతున్నారు.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టికెట్ కావాలని కోరిన సీతారాం నాయక్ కు అప్పుడు, ప్రస్తుత ఎంపి టికెట్ల విషయంలో ఇప్పుడు భంగపాటే జరిగింది. ఊహించని విధంగా 2014లో మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి టికెట్ దక్కించుకున్న సీతారాం నాయక్ పై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి ఉంది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు కారుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆయన తాను టిఆర్ఎస్ పార్టీని వీడేది లేదని, తెరమీద కావాలని బురద జల్లుతున్నారని ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే గులాబీ బాస్ మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ పనితీరుపై ఎమ్మెల్యేలను, పార్టీ నాయకత్వాన్ని అడిగి తెలుసుకున్నారు పెద్దగా ఆయన పైన వివాదాలు లేనప్పటికీ అందరితో సమన్వయ ఉండదు అనే విషయాన్ని, చురుకుగా కూడా వ్యవహరించలేరు, స్థిరంగా ఉండలేక పోవడం వంటి లోపాలను గులాబీ బాస్ కెసిఆర్ ముందు పెట్టారు మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు .

అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మంత్రి అజ్మీర చందూలాల్ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఈసారి తనకు టిక్కెట్ కేటాయించాలని ప్రయత్నాలు చేశారు. ఇక తన సిట్టింగ్ స్థానం తనకే కేటాయించాలని ప్రొఫెసర్ సీతారాం నాయక్ సైతం పావులు కదిపారు. ములుగు నుండి ఇద్దరు నేతలు టికెట్ కావాలని కోరడంతో వీరిద్దరిని కాదని మానుకోట నుండి మాలోతు కవిత కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. రెడ్యానాయక్ మంత్రిగా అవకాశం ఇస్తారని భావించిన నేపథ్యంలో, రెడ్యానాయక్ కు మంత్రిగా స్థానం ఇవ్వలేదు కాబట్టే ఆయన కుమార్తె మాలోతు కవిత కు ఎంపీ గా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఏది ఏమైనా తన సిట్టింగ్ స్థానం తనకే దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్న ప్రొఫెసర్ సార్ కు సీఎం కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం అజ్మీర సీతారాం నాయక్ దారెటు అన్న చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుంది.

Related News