Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ రెండు కారణాలే టికెట్ విషయంలో వివేక్ కొంప ముంచింది

Category : state politics

తెలంగాణా సీఎం కేసీఆర్ పెద్దపల్లి టికెట్ వివేక్ కు కేటాయిస్తారని అంతా భావించారు. కానీ గులాబీ బాస్ వివేక్ కు షాక్ ఇచ్చారు. రెండు కారణాలు వివేక్ కొంప ముంచాయని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. స్థానిక నాయకత్వ వ్యతిరేఖత , సోదరుడి పోటీ వెరసి వివేక్ కు ఎంపీ గా అవకాశం లేకుండా చేసిందని టాక్ వినిపిస్తుంది .

పార్లమెంట్ ఎన్నికల టికెట్ల విషయంలో ఆచితూచి అభ్యర్థులను ఖరారుచేశారు. సామాజిక సమీకరణాలు, పార్టీ అంతర్గత సర్వే, క్రమశిక్షణ, విధేయత తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేశారు. సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు కేటాయించని కేసీఆర్ జిల్లా పార్టీ శ్రేణులకు, ఎమ్మెల్యేలకు, ప్రస్తుత మంత్రులకు పెద్దపీట వేసి వారందరి అభిప్రాయం మేరకే టికెట్ల కేటాయింపు జరిపారు. వివేక్‌కు టికెట్ ఇవ్వొద్దని పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలు ఫిర్యాదుచేయడంతో ఆయనకు టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది.

పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎంపీ వివేక్‌ కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ, టిక్కెట్లు దక్కుతుందని అందరూ భావించారు. కానీ వివేక్ ను సైతం పక్కనపెట్టి గులాబీ బాస్ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్ కు గురి చేసింది.

మాజీ ఎంపీ వివేక్ కు టికెట్ ఇవ్వకపోవడానికి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కారణంగా భావించవచ్చు. ఎందుకంటే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోదరుడికి టికెట్ ఇవ్వనందుకు, వివేక్ తమ నియోజకవర్గాల్లో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, ప్రత్యర్ధులను గెలిపించేందుకు నిధులు ఇస్తున్నారని గులాబీ బాస్ కు నలుగురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఆయన సోదరుడు వినోద్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని, తిరిగి కాంగ్రెస్ లో చేరకుండానే ఎన్నికల్లో పోటీ చేయడం వంటి పరిణామాలు ఇప్పుడు వివేక్ కు టికెట్ దక్కకుండా చేశాయి.

పార్టీ సీనియర్‌ నేతల్లో ఒకరు అయిన వివేక్ పై శాసనసభ ఎన్నికల ముందు వరకు మంచి సానుకూలత ఉంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల పుణ్యమాని కష్టకాలం మొదలైంది . ఇక వివేక్ అభ్యర్థిత్వంపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తోడు మిగిలిన ఎమ్మెల్యేలు సైతం పూర్తిగా వ్యతిరేకించారు. వివేక్‌ విషయంలో చివరివరకు సానుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు సీఎం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు ‘ససేమిరా’ అనటంతో సీఎం కేసీఆర్ వివేక్ కు సైతం నో ఛాన్స్ అన్నారని సమాచారం .