//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

23న కార్తీ సిబిఐ ముందు హాజరు కావలసిందే

Category : national

కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంకు మరోసారి సుప్రీం కోర్ట్ లో చుక్కెదురైంది.  ఈ నెల 23న సీబీఐ ఎదుట హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనను అనవసరంగా ఇరికించారని కార్తి చేసిన వాదనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అభివృద్ధి మండలి (ఎఫ్ఐపీబీ) అనుమతుల పేరుతో తనను వేధిస్తున్నారని, కానీ వారి అసలు లక్ష్యం తన తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరమని కార్తి చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయన తరపు న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం తన వాదనలో ప్రధాన రాజకీయ నేతల బంధువులను లక్ష్యంగా చేసుకోవడం ఫ్యాషన్‌గా మారిందని పేర్కొన్నారు.

తాను అమాయకుడినంటూ కార్తి చేస్తున్న వాదనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే ఎస్ ఖేహర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సీబీఐ ఎదుట హాజరుకానక్కర్లేనంత మంచివాడినని చెప్పాలనుకుంటున్నారా?’’ అని నిలదీసింది. దీనిపై కార్తి స్పందిస్తూ సీబీఐ ఎదుట హాజరు కావడంపై తనకు భయం లేదని, అయితే తనకు రక్షణ కావాలని కోరారు.

సుప్రీంకోర్టు స్పందిస్తూ సీబీఐ ఎదుట హాజరయ్యేటపుడు న్యాయవాదిని తీసుకెళ్ళవచ్చునని కార్తికి అనుమతి ఇచ్చింది. అయితే విచారణ సమయంలో వినికిడి దూరంలో న్యాయవాదిని ఉంచుకోకూడదని స్పష్టం చేసింది.