కర్నాటకు చెందిన మొహమ్మద్ షఫీ అర్మర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది అమెరికా. అగ్రరాజ్యానికి చెందిన ట్రజరీ శాఖ తాజాగా అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసింది. ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చెందిన చీఫ్ రిక్రూటర్‌గా షఫీ అర్మర్ వ్యవహరిస్తున్నాడని అమెరికా ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. దాంతో అతన్ని గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించినట్లు అమెరికా పేర్కొన్నది. షఫీ అర్మర్ది కర్నాటకలో భక్తల్. ఇంటర్‌పోల్ కూడా అతనిపై రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేసింది. 30 ఏళ్ల అర్మర్‌కు అనేక పేర్లు ఉన్నాయి. చోటే మౌలా, అంజన్ భాయ్, యూసుఫ్ అల్ హింది అని కూడా పిలుస్తారు. భారత్‌లో అర్మర్ కీలక ఐఎస్ నేతగా వ్యహరిస్తున్నాడు. ఇస్లామిక్ స్టేట్ సంస్థకు ఉగ్రవాదులను కూడా అతను రిక్రూట్ చేస్తున్నట్లు అమెరికా తన ప్రకటనలో పేర్కొన్నది. భారత్‌లో జరిగిన ఉగ్రవాదులకు కారణమైన అనేకమంది ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులను అతనే నియమించినట్లు అమెరికా వెల్లడించింది. ప్రస్తుతం అర్మర్ పాకిస్థాన్‌లో ఉంటున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఇండియన్ ముజాహిద్దిన్పై దాడులు పెరగడంతో అతను పాక్‌కు వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఫేస్బుక్, ఇతర వెబ్సైట్ల ద్వారా అర్మర్ ఐఎస్ సానుభూతిపరులను రిక్రూట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.