//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Category : politics

తమిళనాట మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టింది . సినీ నటుడు కమల్‌ హాసన్ మదురైలో భారీ జనసందోహం మధ్య తన పార్టీ పేరును ప్రకటించారు.రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఇంటిని సందర్శించి కమల్‌ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. కమల్ పార్టీ పేరు మక్కల్ నీది మయ్యమ్(పీపుల్స్ జస్టిస్ పార్టీ). ప్రజలకు న్యాయం చేసే పార్టీగా కమల్ తన రాజకీయ పార్టీని అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ తాను నాయకుడిని కాదని, మీలో ఒకడిని అని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తాను ఒక్కరోజు ఆట కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు.

ఆరు చేతులు ఒకదాన్కొకటి మణికట్టు దగ్గర పట్టుకున్నట్లుగా, వర్తులాకృతిలో ఉన్న చిత్రం, మధ్యలో నక్షత్రం ఉండేలా పతాక రూపకల్పన చేశారు. ఆ చేతులు ఎరుపు, తెలుపు రంగుల్లో ఒకదాని తరువాత మరొకటి ఉండేలా చిత్రించారు. తెలుపు రంగు జెండాలో ఎరుపు, నలుపు రంగు మిళితమై ఉంది. చేయి చేయి కలిపి ఉన్నట్లు ఈ జెండాలో ప్రధానంగా కనిపిస్తోంది.ఆ ఆరు చేతులు ఆరు దక్షిణాది రాష్ట్రాలకు ప్రతీకలని తన ప్రసంగం సందర్భంగా కమల్‌ వివరించడం విశేషం. దక్షిణ తమిళనాడులోని మదురైలో నిర్వహించిన ఈ భారీ బహిరంగసభకు కమల్‌ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను ప్రజల చేతుల్లోని ఆయుధాన్నని అభివర్ణించుకున్న కమల్‌, పార్టీ ఏర్పాటు ప్రజాపాలనకు తొలి అడుగని, ఇక్కడున్న ప్రజాసమూహంలోని ప్రతీ ఒక్కరూ నాయకులేనని స్పష్టం చేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలను, వివాదాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. నేను మీకు సలహాలు ఇచ్చే నాయకుడిని కాను. మీ సలహాలు వినే కార్యకర్తను అని వేదికపై కమల్‌ చెప్పడంతో ప్రజలంతా చప్పట్లు, ఈలలు, కేరింతలతో కొత్త పార్టీకి స్వాగతం పలికారు.

రాజకీయాల్లో చేరేందుకు వృత్తి ఏమిటనేది ముఖ్యం కాదని, నీతి, నిజాయితీ, సత్యం, ఉద్వేగం వంటి సుగుణాలు కలిగి ఉన్నవారంతా రాజకీయ రంగ ప్రవేశానికి అర్హులేనని కమల్‌ చెప్పారు. తమిళనాడు ప్రజలు ఇంకా ఎన్నాళ్లు అవినీతి పాలనలను భరించాలి. మూగవారిగా కలలు కంటూ కాలం గడపాలి ఈ రాష్ట్రంలో డబ్బుకు కొదవ లేదు. మంచి మనుషులకే కొరత ఉంది. నేను నాయకుడిని కాదు. మీ సేవకుడిని. ఓటుకు ఆరువేలు ఇచ్చి నష్టపోతున్నామని నేతలంటున్నారు. నేను డబ్బులిచ్చి ఓటు అడగను.

ప్రజా సేవకుడిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకుంటే మరొకరికి సారథ్యం అప్పగిస్తానే గాని పదవులను పట్టుకుని ఊగిసలాడను. అవినీతి నిర్మూలనకు ప్రజలు నాతో పాటు కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. నేను అధికారంలోకి వస్తే ప్రజలకు క్వార్టర్‌ బాటిల్, స్కూటర్‌లు ఉచితంగా ఇవ్వను. స్కూటర్లు కొనుక్కునే స్తోమతకు ప్రజలను తీసుకుని వస్తాను. ఇన్నాళ్లు ఏలిన వారు ప్రజలకు చేసింది శూన్యం. అందుకే నేను రాజకీయాలలోకి రావాల్సి వచ్చింది అని కమల్‌ చెప్పారు.

కమల్‌ నిజాయితీ గల, నిజ జీవితపు హీరో అని కేజ్రీవాల్‌ ప్రశంసించారు. డీఎంకే, ఏడీఎంకేలు అవినీతి పార్టీలనీ, నిజాయితీ ఉన్న పార్టీకి ఓటేసే అవకాశం ఇప్పుడు తమిళనాడు ప్రజలకు లభించిందని కేజ్రీవాల్‌ అన్నారు. కమల్‌ రాజకీయ అరంగేట్రాన్ని కేరళ సీఎం విజయన్‌ ఓ ప్రకటనలో స్వాగతించారు. లౌకికత్వం, ప్రజాస్వామ్యం, బహుళత్వ సమాజాన్ని కమల్‌ పార్టీ గౌరవిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ ఐపీఎస్‌ అధికారి మవురియా, నటి శ్రీప్రియ మంగళవారం రాత్రి కమల్‌పార్టీలో చేరారు.

నాణ్యమైన విద్య, అవినీతి రహిత పాలన, నిరుద్యోగ నిర్మూలన, కోతలు లేని విద్యుత్‌ నా రాజకీయలక్ష్యాలని కమల్‌ పేర్కొన్నారు. తొలి నుంచి రాజకీయాలకు దూరంగా ఉండిన కమల్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అధికార ఏడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలపై ట్వీటర్‌లో విమర్శలు చేసేవారు. ఏదైనా మాట్లాడాలంటే రాజకీయాల్లోకి రావాలని కొందరు నేతలు అనడంతో అప్పటి నుంచి రాజకీయ రంగ ప్రవేశంపై దృష్టి పెట్టారు. జయలలిత మరణం, డీఎంకే అధినేత కరుణానిధి వృద్ధాప్యం కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో కొంత రాజకీయ శూన్యం ఏర్పడిన నేపథ్యంలో కమల్‌ పార్టీ పెట్టడం గమనార్హం. తమిళనాడులో ఎందరో సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చినా, మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి మినహా మిగతా ఎవ్వరూ పెద్దగా రాణించలేదు.

Related News