ఇటీవల బుల్లితెర పై ప్రసార మాధ్యమాల్లోకి వచ్చి కలకలం రేపిన కల్యాణ్ జువెల్లర్స్ యాడ్ ఇకపై కనిపించదు. తెలుగులో నాగార్జున, హిందీలో అమితాబ్ బచ్చన్, ఆయన కుమార్తె శ్వేతా బచ్చన్ లతో రూపొందించిన ఈ వ్యాపార ప్రకటన బ్యాంకులపై నమ్మకం కోల్పోయేలా ఉందంటూ ఏఐబీవోసీ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో,ఆ యాడ్ ను తీసేస్తున్నట్టు కల్యాణ్ జువెల్లర్స్ ప్రకటించింది.
ఈ యాడ్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఏఐబీవోసీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో, కల్యాణ్ జువెల్లర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కల్యాణరామన్, మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ యాడ్ ను కేవలం ప్రచారం కోసం మాత్రమే రూపొందించామని, అయితే దీనివల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు తెలిపారని ఆయన అన్నారు.
తమ సంస్థ వ్యాపారంలో బ్యాంకింగ్ వ్యవస్థది కీలక పాత్రని, దేశంలోని బ్యాంకులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తూ, ఈ యాడ్ ను తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకులకు నష్టం కలిగించే చర్యలను తామెన్నడూ ప్రోత్సహించబోమని చెప్పారు.